రైతులకు మద్దతుగా రాష్ట్రంలో అఖిలపక్షాలు నిరసనలతో కదం తొక్కాయి. ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టి బంద్‌ను విజయవంతం చేశాయి. కరీంనగర్‌లో కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బైక్ ర్యాలీలు నిర్వహించి అన్నదాతలకు మద్దతు తెలిపారు. ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో వ్యాపార సముదాయాలకు వెళ్లి దుకాణాలు మూసివేయించారు. రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
అలంపూర్‌లో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జగిత్యాలలో జీవన్‌రెడ్డి రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో దీక్ష చేపట్టిన రేవంత్‌రెడ్డి... కార్పొరేటుకు కొమ్ముకాసే చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వామపక్ష శ్రేణుల ఆందోళనలు...
హైదరాబాద్‌తో పాటు జిల్లాల వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్‌తో పాటు వామపక్షాల శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. కోఠి నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు అఖిలపక్ష రైతు సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. గంటన్నరపాటు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతులను కూలీలుగా మార్చే చట్టాలు వెనక్కి తీసుకునే వరకూ తగ్గేది లేదని చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సాగు చట్టాలు రద్దు చేసే వరకూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని కోదండరాం ఉద్ఘాటించారు.
ఉమ్మడి పాలమూరులో...
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామునుంచే నిరసనల్లో పాల్గొన్నారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రధాన రహదారులపై కాంగ్రెస్, వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. రైతుల నడ్డి విరిచేలా కొత్త చట్టాలు ఉన్నాయంటూ... భూపాలపల్లిలో మోకాళ్లపై కూర్చుని అఖిలపక్షం నేతలు నిరసన తెలియజేశారు.
కొత్త చట్టాలను రద్దు చేయాలంటూ అనేక చోట్ల వామపక్షాలు బైక్ ర్యాలీలు నిర్వహించాయి. బస్ డిపోల ఎదుట వామపక్షాల నేతలు కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన గళం వినిపించారు.
ఇదీ చూడండి: భారత్ బంద్ ప్రశాంతం... అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు