Police arrested Bandi Sanjay at TSPSC: లక్షలాది మంది నిరుద్యోగులు, వాళ్ల కుటుంబాలు పేపర్ లీకేజీతో అల్లాడుతుంటే.. దొంగ సారా దందా చేసిన లిక్కర్ క్వీన్‌ను కాపాడుకునేందుకు మంత్రివర్గమంతా దిల్లీ వెళ్లారని బీఆర్ఎస్ నాయకులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మంత్రులకు సిగ్గు లేదా? నిరుద్యోగుల కంటే కేసీఆర్ బిడ్డే మీకు ముఖ్యమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్పంచ్ బిడ్డ కోసం పేపర్ లీకేజీ చేస్తారా అన్నారని విమర్శించారు. ఈ విధమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు.
టీఎస్పీఎస్సీ లీకేజీకి కారణం ఐటీ వైఫల్యమే.. దీనికి బాధ్యతగా మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలనీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీనీ నిరసిస్తూ గన్ పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బండి దీక్ష చేపట్టారు. కుంటిసాకులు చెప్పి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రధాన కారకుడైన కేటీఆర్‌ను ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ఎద్దేవా చేశారు.
వెంటనే కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి అనేదే ఉంటే.. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ సవాల్ విసిరారు. టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి పేపర్ లీకేజీ అక్రమాలపై వాస్తవాలు తెలుసుకుంటానని.. బీజేపీ కార్యకర్తలంతా టీఎస్పీఎస్సీకి తరలి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
అప్రమత్తమైన పోలీసులు బండి సంజయ్‌ని అరెస్ట్ చేసేందుకు.. వెళ్లగా పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. వలయంగా ఏర్పడి అరెస్ట్ చేయకుండా నిరోధించారు. ఎట్టకేలకు పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో పాటు.. పార్టీ ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. బండి సంజయ్‌ను కార్ఖానా, ఈటల రాజేందర్‌ను నాంపల్లి ఠాణాకు తరలించారు.
"టీఎస్పీఎస్సీ విషయంలో 30 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసే వరకు కూడా బీజేపీ వెనకడుగు వేయదు. అందరూ వచ్చి బీజేపీ తరపున సంఘీభావం ప్రకటించండి. ఈ విషయాన్ని రైతులు గుర్తించండి, ఉద్యోగ.. ఉపాధ్యాయ వర్గాల వారు గుర్తించండి, మహిళలు గుర్తించండి.. మీరు అందరూ ఈ విషయంపై ఆలోచించండి. ఇప్పుడు భయపడితే.. మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. టీఎస్పీఎస్సీ వద్ద బీజేపీ యువజన నాయకుల మీద లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థుల మీద లాఠీఛార్జ్ చేశారు. ఇదే టీఎస్పీఎస్సీలో ఎన్నో ఆక్రమాలు జరిగాయి. ఈ విషయంపై వెనక్కి తగ్గే పరిస్థితి లేదు." - బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: