Aviation Show: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రతిష్ఠాత్మకంగా సాగిన ఏవియేషన్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. తొలి రెండ్రోజులు బోయింగ్, ఎయిర్‌బస్, ప్రాట్ అండ్ విట్నీ, రోల్స్ రాయిస్ వంటి సంస్థల వ్యాపార ఒప్పందాలతో ముగియగా.. చివరి రెండ్రోజులు సందర్శకులకు అనుమతితో సందడి నెలకొంది. నాలుగు రోజుల పాటు సాగిన ఏవియేషన్ షోకు 20కు పైగా దేశాలు, ఎనిమిదికి పైగా రాష్ట్రాల నుంచి 5 వేల మంది బిజినెస్ ప్రతినిధులు, 60 వేల మంది సందర్శకులు తరలివచ్చారు. చివరి రోజు 38 వేల మంది నగరవాసులు విమానాశ్రయానికి రావడంతో ఆ ప్రాంగణమంతా సందర్శకులతో కిటకిటలాడింది.
రన్‌వేపై విమానాల సందడి: మొదటి రోజు డజనుకు పైగా విమానాలు రన్‌వేపై సందడి చేయగా.. చివరి రోజు అందులో సగానికి పరిమితమయ్యాయి. ఆదివారం కావడంతో.. సందర్శకులు కుటుంబసభ్యులతో కలిసి ఏవియేషన్ షోను తిలకించారు. ప్రధానంగా చిన్నారులు, యువత విమానాల ప్రదర్శన, ఎయిర్ షోను తిలకించటం.. కొత్త అనుభూతినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రత్యేకాకర్షణగా నిలిచిన సారంగ్ టీం ఎయిర్ షో: సారంగ్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిర్ షో కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎయిర్ ఫోర్స్ బృందం చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. చాలా దూరం నుంచి ఎయిర్‌షోను తిలకించేందుకు వచ్చిన అభిమానులకు... బారికేడ్‌ల వరకే అనుమతించడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు.
ఇదీ చదవండి: