ఎల్లుండి ఈసెట్తో ప్రవేశ పరీక్షలను మొదలు పెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేసింది. పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే.. ఈసెట్ కోసం జేఎన్టీయూహెచ్ సర్వం సిద్ధం చేసింది. కరోనా పరిస్థితులతో పలు మార్లు వాయిదా పడిన ఈసెట్.. ఈనెల 31న ఆన్ లైన్ విధానంలో రెండు పూటలు జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. మద్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు ఈసెట్ ఉంటుందని కన్వీనర్, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ మన్జూర్ హుస్సేన్ తెలిపారు. ఈసెట్ కోసం తెలంగాణలో 52, ఏపీలో 4 కేంద్రాలను సిద్ధం చేశారు.
మొత్తం 28 వేల 15 మంది దరఖాస్తు చేసుకోగా.. ఉదయం 14 వేల 415 మంది.. మధ్యాహ్నం 13 వేల 600 మంది విద్యార్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు సవరించిన హాల్ టికెట్లను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని.. ఇప్పటికే సుమారు 27వేల మంది విద్యార్థులు కొత్త హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు కన్వీనర్ తెలిపారు. ఈసారి పరీక్ష కేంద్రాల్లోకి మంచినీటి బాటిల్, శానిటైజర్, గ్లౌజులు, మాస్కును అనుమతించాలని నిర్ణయించారు. పరీక్ష కేంద్రాలను ఒక రోజు ముందే చూసుకోవాలని.. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని కన్వీనర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ప్రవేశ పరీక్షల వాయిదా కోసం పోరాటం కొనసాగిస్తాం: ఉత్తమ్