TS Agros MakeSoil awareness program at Nampally : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ తాజాగా వినూత్న రీతిలో నగర సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. విశ్వనగరం హైదరాబాద్‌లో నగరసేద్యం కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో మిద్దెతోటలు పెంచుకునేందుకు అనేక కుటుంబాలు ముందుకొస్తోన్నాయి. అయితే.. టెర్రస్ గార్డెన్‌లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు పెంచుకునేందుకు నీటియాజమాన్యం ఒక ఎత్తైతే.. ఎరువు ఓ పెద్ద సవాల్‌గా మారింది.
ఇంట్లోనే సేంద్రియ ఎరువు..: దీన్ని అధిగమించడానికి టీఎస్ ఆగ్రోస్ సంస్థ నడుం బిగించింది. తాజాగా నాంపల్లి టీఎస్ ఆగ్రోస్ కార్యాలయం ప్రాంగణంలో పీవల్ వేస్ట్మేనేజర్స్, నర్జిమ్ఫ్యాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో "మేక్ సాయిల్" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మేక్సాయిల్ పేరిట వెబ్సైట్ ఏర్పాటుచేసి నగరసేద్యందారులు, గృహయజమానులు, ఔత్సాహిక గృహిణులకు అవగాహన కల్పించారు. సాధారణంగా ప్రతిఇంట్లో వంటగది నుంచి కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వ్యర్థాలతో మొక్కలకు సేంద్రీయఎరువు తయారీ విధానంపై చక్కటి అవగాహన ఏర్పరిచారు. ఇంటి బయట ఓ డ్రమ్ ఏర్పాటు చేసి అందులో వ్యర్థాలు వేసి మైక్రోబెల్ పొడి కలిపినట్లైతే సులభంగా వర్మీ కంపోస్ట్ తయారుచేసుకోవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు.
"మేక్ సాయిల్" పేరిట ప్రచారం..: టీఎస్ ఆగ్రోస్ సంస్థతో పరస్పర అవగాహన ఒప్పందం కుదర్చుకున్న పీవల్వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో "మేక్ సాయిల్" పేరిట విస్తృత ప్రచారానికి నడుం బిగించింది. ఇప్పటికే జంట నగరాల్లో ప్రతి ఇంట్లో తడి - పొడిచెత్త వేర్వేరుగా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి అందజేస్తున్న దృష్ట్యా.. అలా ఇవ్వకుండా మనమే వర్మీకంపోస్ట్ తయారు చేసుకుంటే మిద్దెతోటలకు అవసరమైన సేంద్రీయ ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. పర్యావరణహితం కోసం సొంతంగా ఇంట్లో వర్మీకంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఇది చాలా సులువైన మార్గం. ఆర్థికంగా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని రుజువు చేశారు.
త్వరలో నగరమంతా అమలు..: కనీసం ఇక నుంచైనా ఇంటి అవసరాలకు సరిపడా వర్మీకంపోస్ట్ ఉపయోగించి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ, ఔషధ మొక్కలు పెంచుకున్నట్లైతే.. నాణ్యమైన రసాయన అవశేషాల్లేని స్వచ్ఛమైన ఉత్పత్తులు పొందవచ్చు. అవి ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనారోగ్యాల బారినపడకుండా ఆసుపత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసుకోకుండా ఆరోగ్యవంతమైన జీవితం గడపడపవచ్చు.
రాబోయే రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంటింటికీ ఈవిధానం తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పీవల్వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మిస్ ఇండియా మానస వారణాసి "మేక్ సాయిల్" అంబాసిడర్‌గా నియమితులైంది.
"ఇంట్లోనే వంటింటి వ్యర్థాలతో సేంద్రీయ ఎరువు తయారు చేసుకునే విధంగా నగర ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడానికి సంకల్పించాము. ఇందులో భాగంగా వెబ్‌సైట్‌ను రూపొందించాము. సేంద్రీయ ఎరువు తయారీకి పెద్దగా ఖర్చు ఉండదు. అందరికీ అవగాహన కల్పిస్తాము" -తిప్పన విజయసింహారెడ్డి, ఛైర్మన్, టీఎస్ ఆగ్రోస్
"టీఎస్ ఆగ్రోస్ సంస్థతో పరస్పర అవగాహన ఒప్పందం కుదర్చుకుని "మేక్ సాయిల్" పేరిట విస్తృత ప్రచారానికి నడుం బిగించాము. జంట నగరాల్లో ప్రతి ఇంట్లో తడి - పొడిచెత్త వేర్వేరుగా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి అందజేస్తున్న దృష్ట్యా.. అలా ఇవ్వకుండా మనమే ఇంట్లో వర్మీకంపోస్ట్ తయారు చేసుకుంటే మిద్దెతోటలకు అవసరమైన సేంద్రీయ ఎరువుగా ఉపయోగించుకోవచ్చు." -బి.కృష్ణారెడ్డి, సీఈఓ, పీవల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థ
"ఇంట్లోనే వర్మీకంపోస్ట్ ఉపయోగించి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ, ఔషధ మొక్కలు పెంచుకున్నట్లైతే.. నాణ్యమైన రసాయన అవశేషాల్లేని స్వచ్ఛమైన ఉత్పత్తులు పొందవచ్చు. అవి ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనారోగ్యాల బారినపడకుండా ఆసుపత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసుకోకుండా ఆరోగ్యవంతమైన జీవితం గడపడపవచ్చు". -కె.రాములు, మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ ఆగ్రోస్ సంస్థ
ఇవీ చదవండి: