ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉండడం, భారత్‌లో కూడా కరోనా కేసులు ఉద్ధృతం కావడంతో గత ఏడాది మార్చిలో భారత పౌరవిమానయాన సంస్థ విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఒక్కసారిగా ప్రపంచంలోని 28 దేశాలకు తిరిగే అంతర్జాతీయ విమానాలతోపాటు స్వదేశీ విమానాలకు కూడా బ్రేక్ పడింది. అత్యవసర విమానాలు, కార్గో సర్వీసులు మాత్రమే తిరిగేవి.
ఆ తరువాత మహమ్మారి ప్రభావం.. దేశ వ్యాప్తంగా అధికం కావడంతో ఎప్పటికప్పుడు ఆ నిషేదాన్ని పౌరవిమానయాన సంస్థ పొడిగిస్తూ వచ్చింది. వాణిజ్య విమానాలపై ఈ నెల చివర వరకు పౌరవిమానయాన సంస్థ నిషేధం విధించింది. అయితే విమానయాన సంస్థలు ఆయా దేశాలతో ఒప్పందాలు కుదర్చుకుని పరస్పర సహకారంతో 16 నెలలుగా ఆగిన అంతర్జాతీయ విమానాలు తిరిగి నడిపిస్తున్నాయి. భారత దేశం నుంచి ఎక్కువగా రాకపోకలు సాగించే దేశాలకు... డైరెక్ట్ విమానాలను నడిపేందుకు పలు విమానయాన సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలతోపాటు షికాగో, కొలంబో, మాల్దీవులు, మాలె తదితర దేశాలకు విమానాలను నేరుగా నడుపుతున్నారు. ప్రధానంగా పర్యాటకానికి పేరెన్నిక కలిగిన దేశాలతోపాటు కార్మికులు ఎక్కువగా రాకపోకలు సాగించే గల్ఫ్ దేశాలు, విద్య కోసం అధిక సంఖ్యలో విద్యార్థులు వెళ్లే దేశాలకు ఈ విమానాలు నడుస్తున్నాయి.
లండన్‌కు నేరుగా..
తాజాగా శుక్రవారం ఎయిర్ ఇండియా లండన్‌కు నేరుగా విమానాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాలనకునే వారు ఇకపై కేవలం తొమ్మిది గంటల సమయంలోనే గమ్యస్థానం చేకుంటారు. వారంలో రెండు రోజులు సోమ, శుక్రవారాలు ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలు దేరే ఈ విమానం మధ్యలో ఎక్కడ ఆగకుండా నేరుగా లండన్ వెళ్తుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రైలులో వెళ్లేందుకు పట్టే సమయం కంటే కూడా తక్కువ సమయంలో లండన్‌కు వెళ్లవచ్చని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు సమీప రాష్ట్రాలకు చెందిన ప్రయాణీకులు కూడా ఈ సేవలను ఉపయోగించుకునేందుకు అవకాశం ఏర్పడిందని, దీనికి మంచి గిరాకీ ఉంటుందని ఆశిస్తున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ అధికారులతోపాటు శంషాబాద్ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: Hyderabad to London: హైదరాబాద్ టూ లండన్ నాన్‌స్టాప్ విమాన సేవలు ప్రారంభం