AICC Incharge Manikrao Thakre Telangana Tour: రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు ఠాక్రే మంత్రాంగంతో సమసిపోతుందన్న ధీమా పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. మొదటిసారి వచ్చినప్పుడు... పార్టీ నాయకులు చెప్పిన విషయాలను వినేందుకు ఎక్కువ సమయం కేటాయించారు. రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలల్లో మాత్రమే ఆయన దిశనిర్దేశం చేశారు. ఈసారి మూడు రోజులు హైదరాబాద్‌లోనే ఉండి... పార్టీ నాయకులతో వరుసగా భేటీ కానున్నారు. భారత్ జోడో యాత్ర లక్ష్యాన్ని ప్రతి గడపకు చేరవేయాలనే తలంపుతో ప్రతీ కాంగ్రెస్ నేత పాదయాత్ర నిర్వహించేట్లు ఏఐసీసీ కార్యచరణ ప్రకటించింది. దీనిని విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తోంది.
Manikrao Thakre Telangana Tour update : కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర లక్ష్యాన్ని ప్రతి గడపకు చేరవేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరిట రెండు నెలల పాటు ప్రతీ కాంగ్రెస్ నేత పాదయాత్ర నిర్వహించేట్లు ఏఐసీసీ కార్యాచరణ ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మొదలుకొని గ్రామస్థాయి నేత వరకు ఈ హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారని.. జోడో అభియాన్‌ను కాంగ్రెస్ పార్టీ అతి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీనిని విజయవంతం చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది.
హాత్ సే హాత్ జోడో అభియాన్ పర్యవేక్షించేందుకు మాణిక్ రావు ఠాక్రే ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు గాంధీభవన్‌లో నేతలతో సమీక్ష చేయనున్నారు. తొలి రోజు ప్రచార కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌లతో భేటీ అవుతారు. ఆ తర్వాత రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
రెండో రోజు హాత్ సే హాత్ జోడో అభియాన్‌పై పీసీసీ కార్యవర్గ సభ్యులతో సమావేశం అవుతారు. అనంతరం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు.. ఆ తర్వాత ఎన్ఎస్యూఐ నేతలతో సమాలోచనలు జరుపుతారు. సేవాదళ్ నాయకులతో, యువజన కాంగ్రెస్ నేతలు, ఐఎన్టీయూసీ శ్రేణులతో ఠాక్రే భేటీ కానున్నారు. మూడోరోజు ఆదివారం నాడు పార్టీలో సఖ్యత కోసం సీనియర్ నేతలతో ప్రత్యేక మంతనాలు జరుపుతారు. బిజినేపల్లిలో జరిగే దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత శంషాబాద్ నుంచి పూణెకు పయనం అవుతారు.
ఇవీ చదవండి: