వ్యవసాయలో సాంకేతికత రోజురోజుకీ పెరిగిపోతోంది. కూలీల కొరతను అధిగమించడానికి, పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడానికి, అధిక దిగుబడులు సాధించేందుకు.. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ఎన్నో యంత్రాలు అన్నదాతకు అందుబాటులోకి రాగా.. కొత్తగా వచ్చిన 'అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయర్' రైతులను ఆకర్షిస్తోంది. యూరప్, అమెరికా దేశాల్లో విరివిగా ఈ యంత్రాలను వినియోగిస్తున్నారు. మన దేశంలోనూ వీటి తయారీ ప్రారంభమైంది. ఏవియన్ అనే సంస్థ వీటిని రూపొందించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో పలు చోట్ల డ్రోన్ స్ప్రేయింగ్పై 'కిసాన్ సాది' సంస్థ ప్రతినిధులు.. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు వెల్లడించారు.
పనితీరు:
20 లీటర్ల ట్యాంకుతో పది నిమిషాల్లోనే ఎకరం పొలంలో ఎరువులు, పురుగు మందులను ఈ డ్రోన్లు పిచికారీ చేయగలవు. పంటకు మూడు అడుగుల ఎత్తులో ఎగురుతూ.. పొలమంతటా సమానంగా చల్లుతాయి. మొబైల్ యాప్ ద్వారా ఇవి పనిచేస్తాయి. మెట్ట, మాగాణి పంటలకు ఉపయోగించవచ్చు.
రైతుకు లాభం:
తక్కువ సమయంలో, ఎక్కువ విస్తీర్ణంలో క్రిమిసంహారక మందులు పిచికారి చేయడానికి 'అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయర్' ఉపయోగపడుతుంది. సాంప్రదాయ యంత్రాలతో పోలిస్తే ఖర్చు తక్కువ, సులభంగా చల్లుకునే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. తగిన మోతాదులో నీటిని కలుపుకునే సాంకేతికతను వీటిలో పొందుపరిచారు. రైతులకు ప్రాణహాని ప్రసక్తే ఉండదు. ఎరువులు, పురుగు మందుల వృథాను అరికట్టవచ్చు.
ఇదీ చదవండి: 'ధరణి' లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు: కేసీఆర్