addanki dayakar fires on marri shashidharతెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూరే కారణమంటూ ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తాజాగా స్పందించారు. పీసీసీ, మాణికం ఠాగూర్ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. తాము చేసిన వ్యాఖ్యలను పెద్దవి కాకుండా సద్దుమణిగే విధంగా చేయాల్సిన వారు, పార్టీకి సలహాలు ఇవ్వాల్సిన సీనియర్లే ఇలా చేయడం సరికాదన్నారు. భాజపా, ఆరెస్సెస్ చేస్తున్న కుట్రల్లో కాంగ్రెస్ పావులుగా మారుతున్నట్లుగా అనిపిస్తోందని అద్దంకి వ్యాఖ్యానించారు. పీసీసీని ఇలా అంటే పార్టీకే నష్టమని.. ఏదైనా ఉంటే చూసుకోవడానికి పీసీసీ, ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీలు ఉన్నాయని చెప్పారు. తనపైనా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో స్పందిస్తున్నాని, రేవంత్ రెడ్డి చెప్తే కాదని అద్దంకి అన్నారు.
పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం సరికాదు. ఏదన్నా ఉంటే క్రమశిక్షణ కమిటీ చూస్తుంది. ఒక సీనియర్ నాయకుడిగా ఇలా మాట్లాడటం సరికాదు. నన్ను అన్నందుకు బాధపడను.. కానీ పీసీసీపై, మాణికం ఠాగూర్‌పై అలా మాట్లాడటం మీకు సరికాదు. -అద్దంకి దయాకర్, పీసీసీ అధికార ప్రతినిధి
అంతకుముందు బుధవారం మర్రి శశిధర్ రెడ్డి.. రేవంత్‌రెడ్డి, మాణికం ఠాగూర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆ ఇద్దరు నేతలు అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకుసాగేలా దిశానిర్దేశం చేయాల్సిన మాణికం ఠాగూర్.. రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా కలత చెందుతున్నానని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని శశిధర్‌రెడ్డి ఆవేదన చెందారు.
ఇదీ చూడండి: మొక్కలతో మానసిక ఉల్లాసం, గ్రాండ్ నర్సరీ మేళాలో హరీశ్ రావు