Politechnic Exam Paper leak: పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో రాచకొండ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. స్వాతి పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేషన్ కృష్ణమూర్తి, అధ్యాపకుడు కృష్ణమోహన్‌తో పాటు పరిశీలకుడిగా వచ్చిన వెంకట్రామ్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 8,9 తేదీల్లో జరిగిన పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అర్ధగంట ముందే లీక్...
ప్రతి పరీక్షకు అర్ధగంట ముందు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి అధికారులు పేపర్ కోడ్‌ను పంపిస్తారు. దాని ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు పరీక్షా సమయానికి అందజేస్తారు. స్వాతి పాలిటెక్నిక్ కళాశాల నిర్వాహకులు మాత్రం అర్ధగంట ముందే వాట్సాప్‌లో పేపర్‌ను లీక్ చేశారు. 8వ తేదీన విద్యార్థులు పరీక్ష రాశారు. 9వ తేదీన జరిగిన పరీక్షా పేపర్‌ను అర్ధగంట ముందే వాట్సాప్‌లో పంపించారు. స్వాతి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ స్నేహితులకు వాట్సాప్‌లలో ప్రశ్నాపత్రాన్ని పంపించారు. మెదక్ జిల్లా చేగుంటలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు 8వ తేదీన జరిగిన పరీక్షకు అర్ధగంట ఆలస్యంగా వచ్చారు.
అనుమానం వచ్చి...
9వ తేదీన కూడా పరీక్ష హాల్లో ఎవరూ కనిపించకపోవడం వల్ల అనుమానం వచ్చిన పరిశీలకుడు పరీక్షా కేంద్రం బయట చెట్ల కింద విద్యార్థులు కూర్చొని ఉండటాన్ని గమనించాడు. అక్కడి వెళ్లి వారి చరవాణులను పరిశీలించగా... ప్రశ్నాపత్రం కనిపించింది. పరిశీలకుడు వెంటనే ఈ విషయాన్ని సాంకేతిక విద్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ప్రశ్నాపత్రంలోని కోడ్‌ను పరిశీలించగా... స్వాతి పాలిటెక్నిక్ కళాశాల నుంచి లీకైనట్లు గుర్తించారు. వెంటనే అధికారులు అబ్ధుల్లాపూర్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకెవరెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Medaram Tollgate charges : మేడారం భక్తులపై మరోభారం.. తప్పని 'టోల్' తిప్పలు