భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం రావికంపాడులో 2 ఎకరాల భూమి తమదంటే తమదని రెండు కుటుంబాల మధ్య మూడేళ్లుగా రగులుతున్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. రావికంపాడుకు చెందిన రాములు అనే వ్యక్తి కుటుంబానికి 2 ఎకరాల భూమికి పట్టా ఉంది. ఆ తర్వాత కాలంలో చెరుపల్లి కోదండరామారావుకు రాములు ఆ భూమిని అమ్మేశాడు. ఆ తర్వాత పట్టాపహానీల్లో పట్దాదారు పేరు రాములుకు బదులుగా భూషయ్య అనే వ్యక్తి పేరు చేరింది. అనుభవదారుగా ప్రభుత్వ భూమి అని పడింది. ఈ విషయంపై కోదండరామారావు కుటుంబ సభ్యులు చాలా రోజులుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈలోపే భూషయ్య కుటుంబీకులు భూమిలో గుడిసెలు వేసుకున్నారు. దీంతో భూషయ్య, కోదండరామారావు కుటుంబ సభ్యులకు తరచూ గొడవలవుతున్నాయి. ఇవాళ కూడా భూమి తమదంటే తమదంటూ గొడవకు దిగారు.
గ్రామపెద్దల పంచాయతీ జరగ్గా... 2 ఎకరాల భూమి కోదండరామారావు కొడుకు రామచంద్రరావుకు చెందుతుందని పెద్దలు తీర్మానించారు. ఇందుకు భూషయ్య కుటుంబీకులు అంగీకరించకపోవడంతో... ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రెండు వర్గాల వారు పరస్పరం కర్రలలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రెండు వర్గాలను చెదరగొట్టి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలవ్వగా... వారిని కొత్తగూడెం ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
ఇవీ చదవండి: విషాద 'లంక'లో క్షణక్షణం.. భయం భయం