రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వరదలు ఉప్పొంగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని మల్లన్న వాగుకు వరద ఉద్ధృతి పెరగింది. వాగు దాటి మండల కేంద్రానికి వచ్చేందుకు గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. నర్సాపురం తండాకు చెందిన భిక్షమయ్య తన చంటి బిడ్డకు టీకా నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లేందుకు అతికష్టం మీద వాగు దాటాడు. ఆరోగ్య కేంద్రంలో టీకా వేయించి తిరిగి మళ్లీ వాగు దాటి స్వగ్రామం నర్సాపురానికి చేరుకున్నాడు.
టీకా కోసం తప్పనిసరి పరిస్థితుల్లో చంటిబిడ్డను పట్టుకుని వాగు దాటాల్సి వచ్చిందని... పొరపాటున జరగరానిది ఏదైనా జరిగితే ఆ పసిప్రాణం పరిస్థితి ఏంటని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మల్లన్నవాగుపై పనుల్లో వేగం పెంచి వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.