భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన రాజేష్... ధర్మారం తండాకు చెందిన అజ్మీర కైకు దివ్యాంగులు. వీరు 2010లో పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఆర్థికంగా చితికిపోయిన వీరిని కరోనా మరింత దిగజార్చింది.
రాజేష్ స్థానికంగా బేకరీలో పనిచేస్తున్నానని... రోజుకు 120 రూపాయలు మాత్రమే వస్తాయని తెలిపారు. ఆర్థికంగా నిలదక్కుకునేందుకు ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనికోసం ఎక్కడికైనా వెళ్దామంటే ద్విచక్రవాహనం కూడా లేదని... ప్రభుత్వానికి ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నాడు.
ఇద్దరు దివ్యాంగులే కావడంతో ఇంటి పని మొత్తం కుమార్తెపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురికి కంటి సమస్య ఉన్నదని... ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్లు కూడ అన్నదమ్ముల పొత్తుతో ఉన్నదని... తమకు ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని దివ్యాంగ దంపతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: నీటిసంపులో పడేసి పసికందును చంపిన తండ్రి