రానున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి ఎన్నికల్లో తనను గెలిపించాలని వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి జయ సారథి రెడ్డి పేర్కొన్నారు. తాను గెలిస్తే ప్రజా గొంతుక అవుతానని తెలిపారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం, మణుగూరు మండలాల్లో సీపీఐ, సీపీఎం ముఖ్య నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం మణుగూరు సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
దేశంలో మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికొదిలేసి, పాలన సాగిస్తున్నారని జయ సారథి రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా యువతకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీ, మోదీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీలు నీరుగారిపోయాయన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై.. ప్రైవేటీకరణను వేగవంతం చేశాయని ఆయన ఆరోపించారు. పరిశ్రమలను మూసేస్తూ కార్మికుల, ఉద్యోగుల శ్రమను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నాయని ధ్వజమెత్తారు. తనను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.