NO FACULTY: స్వయం ఉపాధితో పాటు ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం పొందేలా ఆదిలాబాద్‌లోని ఐటీఐ కాలేజీలో ఆరు ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, డీఎం సివిల్, వెల్డర్, డ్రెస్ మేకింగ్, స్టెనో, కోపా ట్రేడ్‌లలో 220 మంది ప్రవేశం పొందారు. నిన్న మొన్నటి వరకు రెగ్యులర్ బోధకులు, అతిథి అధ్యాపకులు పని చేసినా.. బదిలీల్లో కొందరు, ఇతర కారణాలతో మరికొందరు కళాశాలను వదిలి వెళ్లడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 8 పోస్టులకు గానూ.. ప్రిన్సిపల్, మరో శిక్షణాధికారి మాత్రమే పని చేస్తుండగా.. మిగిలిన 6 పోస్టులకు బోధకులు లేరు. విద్యార్థులు తరగతి గదులకు వచ్చి బోధన లేకుండానే వెళ్లిపోతున్నారు. బోధకులు లేక కంప్యూటర్ గదికి తాళం వేశారు. మరికొన్ని ట్రేడ్‌ల గదులు తెరవట్లేదు. సిలబస్ పూర్తికాక పరీక్షల్లో ఎలా గట్టెక్కేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
కనీసం వారినైనా..
బోధకుల కొరత అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో మల్టీమీడియా తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నా.. అవి అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. తాత్కాలిక బోధకులనైనా నియమించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
అలా చేస్తే తాత్కాలికంగానైనా..
పరీక్షలు సమీపిస్తున్నందున కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందిస్తే.. రాష్ట్రంలోని ఐటీఐ కళాశాలల్లో బోధకుల కొరత తాత్కాలికంగా తీరే అవకాశం ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
ఇవీ చూడండి..