ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం జాతరకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మెస్రం వంశస్థులు గంగాజలం కోసం నాగోబా ఆలయం నుంచి చేపట్టిన పాదయాత్ర బుధవారం కుమురం భీం జిల్లా జైనూరు మండలంలో సాగింది. ఆ మండలంలోని గౌరి గ్రామ శివారులోని వనం కింద మెస్రం వంశస్థులు బస చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు.
ఇప్ప, మారేడు, మర్రి, తునికి చెట్లన్నీ ఒకే చోట ఉండటం చాలా అరుదు. ఆ చెట్లన్నీ గౌరి గ్రామ శివారులో ఉన్నాయి. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం వారు.. ఇప్ప చెట్టును భీం దేవుడిగా కొలుస్తూ మారేడు చెట్టు బిల్వ పత్రాలను, తునికి చెట్టు పండ్లను మర్రి ఆకుల్లో నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆ చెట్ల కిందే సహపంక్తి భోజనాలు చేశారు.