కాకతీయ విశ్వవిద్యాలయం పరిధి తగ్గనుంది. ప్రస్తుతం ఆ వర్సిటీ కింద ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కళాశాలల యజమానులకు, విద్యార్థులకు కేయూ దూరాభారంగా మారింది. ఈక్రమంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీ పరిధిలోకి; ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలను కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆయా వర్సిటీల పరిధిని నిర్ణయించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి 2018లోనే ఓయూ మాజీ ఉపకులపతి ఆచార్య సులేమాన్ సిద్ధికీ ఛైర్మన్‌గా కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్‌ను కేయూ నుంచి తప్పించి తెలంగాణ, శాతవాహన వర్సిటీల పరిధిలోకి తీసుకురావాలని సిఫార్సు చేసింది. మూడేళ్ల క్రితమే ఆ కమిటీ నివేదికను ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు.
పాత నివేదిక కూడా ప్రభుత్వానికి
తాజాగా సీఎం కార్యాలయం కొత్త ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల సమాచారం అడిగింది. ఉన్నత విద్యా మండలి.. ఆ సమాచారంతోపాటు గతంలో పంపిన వర్సిటీ పరిధి నివేదికను కూడా జత చేసింది. కమిటీ నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కమిటీ సిఫార్సు ప్రకారం ఇప్పటివరకు ఓయూ పరిధిలో ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా మూడు వర్సిటీల కిందకు వెళ్లనుంది. శాతవాహనకు సిద్దిపేట, తెలంగాణ వర్సిటీలోకి మెదక్ వెళ్తుంది. సంగారెడ్డి జిల్లా ఓయూ కిందే ఉండనుంది. ప్రస్తుత పరిణామాల గురించి కాకతీయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ ఏమన్నారంటే.... ‘‘గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. తాజాగా మాకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల పరిధిలో ఎటువంటి మార్పూ ఉండదు’’ అని చెప్పారు.
ఇదీ చూడండి: Gold Rate today: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన పసిడి ధరలు