రాష్ట్రంలో నాణ్యమైన పత్తికి పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ క్రయవిక్రయాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. విక్రయించిన పత్తికి రావాల్సిన డబ్బులకంటే తక్కువగా రావడం రైతుల ఆందోళనకు దారితీసింది.
రూ.వేలల్లో తక్కువగా...
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈనెల 11న జరిగిన పత్తి విక్రయాల్లో రైతుల డబ్బుల విషయంలో తేడా వచ్చింది. మధ్యాహ్నం వరకు తలెత్తిన సాంకేతిక కారణంతో తూకాలు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ప్రారంభమైన తూకాల్లో లోడుతో ఉన్న వాహనాల తూకం సరిగానే వచ్చింది. కానీ ఖాళీ వాహనాల్లో హెచ్చుతగ్గులు రైతులను కలవరపెట్టాయి. చివరికి అన్నీ సవ్యంగానే ఉన్నాయనుకునప్పటికీ... విక్రయించిన పత్తికంటే తక్కువ డబ్బులు రావడం రైతులను అయోమయానికి గురి చేసింది. ఒక్కో రైతుకు రూ.వేలల్లో తక్కువగా రావడం చివరికి ఆందోళనకు దారితీసింది.
పర్యవేక్షణ లోపమే...
రైతుల ఆందోళనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే కాంటాలను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెటింగ్ ఆన్‌లైన్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఉన్నట్లు తేల్చి... రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా... అన్నదాతల ఆందోళన సద్దుమనిగింది. పంటకు రావాల్సిన దానికంటే తక్కువగా డబ్బులు వచ్చిన రైతులను ఒక్కొక్కరిని గూర్చి ఆరాతీయాల్సి వస్తోంది. పత్తి కొనుగోళ్ల ప్రారంభం నుంచి తూనికలు కొలతల విభాగం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే అనేక సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలకు ఈ ఘటన బలం చేకూర్చింది.
ఇదీ చదవండి: 'రామరాజ్య స్థాపన జరగాలంటే రామమందిరం నిర్మించాల్సిందే'