ఆదివాసీల ఐక్యతను దెబ్బతీసేందుకు తెరాస నాయకులు ప్రయత్నిస్తున్నారని తుడుండెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, భాజపా ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. గిరిజనుల సమస్యలను తీర్చడం లేదంటూ సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆదివాసీ తొమ్మిది తెగల ఉద్యోగుల ఐక్యతా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎన్నికలకు ముందు పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీని విస్మరించారని దుయ్యబట్టారు. ఆదివాసీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సదస్సులో పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును ఘనంగా సన్మానించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగుల సంఘ నాయకులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు ఆదివాసీల గుస్సాడీ నృత్య ప్రదర్శన అలరించింది. తమ జాతి కోసం ఉద్యోగులు పాటు పడాలని సోయం బాపురావు పిలుపునిచ్చారు.