ఈ మధ్యే టోక్యోలో ఎంతో అట్టహాసంగా ఒలింపిక్స్ ముగిశాయి. 206 దేశాలు 'నువ్వానేనా' అన్నట్టు పోటీపడ్డాయి. 90కి పైగా దేశాలు పతకాలు సాధించాయి. అందులో కొందరు రికార్డులు బద్దలు కొడుతూ పతకాలు గెలుచుకున్నారు. అయితే విశ్వ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన పోటీల్లో నెలకొల్పిన రికార్డుల్లో కొన్ని ఎవరూ బద్దలు కొట్టలేనివీ, చాలా ఏళ్లు నిలిచిపోయినవీ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దామా!
28 పతకాలు గెలిచాడు!
ఒలింపిక్స్ క్రీడల చరిత్రలోనే అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా ఎప్పటికీ, ఎవరూ అందుకోలేని రికార్డు నెలకొల్పాడు అమెరికాకు చెందిన మైకేల్ ఫెల్ప్స్. 2016 రియో ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న ఈ అథ్లెట్ అయిదో పదో కాదు ఏకంగా 28 పతకాలు కొల్లగొట్టాడు. అందులో 23 బంగారు పతకాలుండడం విశేషం. మిగతా అయిదు పతకాల్లో 3 రజతాలు, 2 కాంస్యాలు. 2000 సంవత్సరం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఫెల్ప్స్.. తన పతకాల వేటను 2004లో మొదలుపెట్టాడు. అప్పట్నుంచి 2016 వరకు 100 మీటర్ల బటర్‌ఫ్లై, 200 మీటర్ల బటర్‌ఫ్లై, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ.. ఇలా రకరకాల ఈత విభాగాల్లో మొత్తం 28 పతకాలు దక్కించుకుని రికార్డు నెలకొల్పాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో- పోటీపడ్డ ఎనిమిది విభాగాల్లోనూ అతను స్వర్ణాలు గెలవడం విశేషం. ఫెల్ప్స్ రికార్డులు ఎప్పటికీ ఎవరూ బద్దలు కొట్టలేరన్నది విశ్లేషకుల అంచనా.
ఒకేసారి 239 మెడల్స్!
ఒలింపిక్స్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా పతకాల పట్టికలో దాదాపు అమెరికాదే ఆధిపత్యం. మొత్తం ఒలింపిక్ క్రీడల్లో ఇప్పటి వరకూ దాదాపు 3వేల మెడల్స్ సాధించి ప్రథమ స్థానంలో ఉంది. అంతే కాదు, 1904లో అమెరికా గడ్డపైన జరిగిన పోటీల్లో మరో ప్రత్యేకమైన రికార్డు సాధించింది. ఆ ఏడాది యూఎస్‌ఏ అత్యధికంగా 239 పతకాలు గెల్చుకుంది. అందులో 78 స్వర్ణాలు, 82 రజతాలు, 79 కాంస్యాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఏ ఒలింపిక్స్ క్రీడల్లో ఇన్ని పతకాలు ఏ దేశానికీ రాలేదు. ఒక ఒలింపిక్ క్రీడల్లో భారీగా మెడల్స్ అందుకున్న రికార్డు ఇప్పటికీ అమెరికాదే.
ఇదీ చదవండి: పసికందు 'గుండె' కోసం ఆమె ఒలింపిక్ పతకం వేలం
పదిసార్లు పాల్గొన్నాడు!
కెనడాకు చెందిన ఇయాన్ మిల్లర్ ప్రతి ఆటగాడికీ ఆదర్శమని చెప్పుకోవచ్చు. పతకం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా నలభై ఏళ్లు ప్రయత్నించాడు మిల్లర్. చివరికి అనుకున్నది సాధించాడు. ఇదీ ఒక ఘనమైన రికార్డే. మిల్లర్ 1972 నుంచి 2012 వరకు వరుసగా 10 ఒలింపిక్ పోటీల్లో ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) క్రీడల్లో పాల్గొన్నాడు. 2008లో రజతం దక్కించుకున్నాడు. 2016లో తన గుర్రానికి దెబ్బ తగలడం వల్ల పాల్గొనలేకపోయాడట. ఎక్కువసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఒలింపియన్‌గా రికార్డు అతడిదే!
72 ఏళ్ల ఒలింపియన్!
ఆస్కార్ స్వాన్... ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతి పెద్ద వయస్కుడు. 72 ఏళ్ల వయసులో అతను ఒలింపిక్స్ ఆడి పతకం గెలవడం విశేషం. స్వీడన్‌కు చెందిన ఈ అథ్లెట్ 1908, 1912, 1920 ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో పాల్గొని మొత్తం ఆరు పతకాలు సాధించాడు. అందులో మూడు బంగారు పతకాలు. 1920 ఒలింపిక్ క్రీడల్లో 72 ఏళ్ల వయసులో పతకం సాధించి ఆస్కార్ 'ఓల్డెస్ట్ ఒలింపిక్ మెడలిస్ట్'గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకూ అదే రికార్డు.
టేబుల్ టెన్నిస్‌లో 60 పతకాలు!
సియోల్ వేదికగా 1988లో జరిగిన ఒలింపిక్స్‌లో మొదటిసారిగా టేబుల్ టెన్నిస్ ఆటని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ ఆటలో అత్యధికంగా మెడల్స్ సాధించిన రికార్డు చైనాకే ఉంది. టేబుల్ టెన్నిస్‌లో మొత్తం 60 పతకాలు సొంతం చేసుకుందీ దేశం. అందులో 32 స్వర్ణాలు, 20 రజతాలు, 8 కాంస్యాలు. మరే దేశమూ ఈ ఆటలో దీనికి దరిదాపుల్లో లేదు.
13 ఏళ్లకే స్వర్ణం!
ఒలింపిక్స్‌లో అతి పిన్న వయసులో స్వర్ణం సాధించిన రికార్డు అమెరికాకు చెందిన మార్జొరీ గెస్ట్రింగ్ సొంతం. 1936 బెర్లిన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొన్న మార్జొరీ డైవింగ్‌లో తన ప్రతిభ చూపిస్తూ బంగారు పతకం దక్కించుకుంది. 13 సంవత్సరాల వయసులోనే ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకుని అతి చిన్న వయసులో ఒలింపిక్ పతకం సాధించిన రికార్డును తన పేరున లిఖించుకుంది. అయితే టోక్యో 2020 ఒలింపిక్స్‌లో ఆ రికార్డుకు చాలా దగ్గరగా వెళ్లింది 13 ఏళ్ల జపాన్ క్రీడాకారిణి మొమిజి నిషియా. మహిళల స్ట్రీట్ స్కేట్ బోర్డింగ్ పోటీల్లో అరంగేట్రంలోనే స్వర్ణపతకం సాధించినా రెండు నెలల వయసు తేడా ఉండటం వల్ల మార్జొరీ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.
ఇదీ చదవండి: Neeraj Chopra: ఫోన్ పక్కన పెట్టా.. స్వీట్లు మానేశా