ఒలింపిక్స్‌లో పతక విజేతగా నిలవాలనే తపనతో ఈ తరం అథ్లెట్లు డయిట్ పేరుతో తిండిలో పరిమితి పెట్టుకుంటున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ సింధు దగ్గర్నుంచి ఇటీవలే ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన మీరాబాయి వరకు.. చాలా మంది తమకు ఇష్టమైన ఆహారాన్ని వదిలేసి.. ఫిట్నెస్ నిత్యం కోసం తపనపడుతున్నారు.
ఇష్టమైన తిండికి దూరంగా..
పెరుగు అంటే తనకు ఎంతో ఇష్టమని స్టార్ షట్లర్ సింధు అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. కానీ, పెరుగు తింటే ఫిట్నెస్ను కాపాడుకోవడం కష్టమని.. అందుకే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు దానికి దూరంగా ఉంటానని చెప్పింది.
అదే విధంగా టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన మణిపూర్ గర్ల్.. మీరాబాయి చానుకు పిజ్జా అంటే అమితమైన ప్రేమ. ఫిట్నెస్ కోసమే తనకు ఇష్టమైన ఫుడ్‌ను దూరం పెట్టింది. ఇప్పుడు పతక విజేతగా నిలిచిన తర్వాత పిజ్జా తినేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో తనకు ఇష్టమైన పిజ్జాలను మీరాబాయికి జీవితాంతం ఉచితంగా అందిస్తామని ప్రముఖ పిజ్జా తయారీ సంస్థ డొమినొస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఇలా తమకున్న చిన్న చిన్న కోరికలను చంపుకుని.. కలల వైపు ఎంతోమంది క్రీడాకారులు సాగిపోతున్నారు. ఓ సగటు క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే దాదాపు 5 ఏళ్ల పాటు ఫిట్నెస్ కొనసాగిస్తూ.. ఆటపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో తినే ప్రతి దాంట్లో తప్పక నిబంధన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఒకే బరువుతో ఏళ్లపాటు..
ఉదాహరణకు చెప్పాలంటే బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో కేజీల విభాగాలుంటాయి. అందులో పాల్గొనే అథ్లెట్లు ఆ విభాగానికి ఏళ్లపాటు అదే బరువుతో ఉండాలి. అలా ఉండాలంటే చిరుతిండ్లు పూర్తిగా కట్టిపెట్టాల్సిందే! అయితే అన్ని ఏళ్ల కఠోర శ్రమకు తగిన ఫలితం లభిస్తే.. అథ్లెట్ల ఆనందానికి అవధులు ఉండవు. ఆ సంతోషంలో వాళ్లు చేయాలకున్న వాటన్నింటి జాబితా సిద్ధం చేస్తారు. ఫిట్నెస్ కోసం ఇన్నేళ్ల పాటు చేసిన డయిటింగ్ను పక్కన పెట్టి వాళ్లకు ఇష్టమైన ఫుడ్‌ను ఆస్వాదిస్తారు.

పోటీ అవ్వగానే తింటానంటూ..
ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ వేదికగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఫిలిప్పిన్స్‌కు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్ బరువులెత్తే సమయంలో.. ఇకపై తనకు నచ్చిన ఆహారాన్ని తినొచ్చు అనే ఆనందాన్ని ఒలింపిక్స్ వేదికగా వ్యక్తపరిచింది. 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పాల్గొన్న హిడిలిన్ డియాజ్.. విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. ఆ విభాగంలో విజేతగా నిలిచిన ఆనందంలో.. తన చేతిలో ఉన్న బరువు దించుతూనే సంబరాలు చేసుకుంది. 'ఈ రోజు నుంచి ఎంత కావాలంటే అంత తింటాను' అంటూ ఆనందోత్సాహంతో మునిగితేలింది.
ఫిలిప్పిన్స్నుంచి ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లలో తొలిసారి పసిడి పతకం సాధించింది ఆమెనే కావడం విశేషం.
ఇదీ చూడండి.. ఒలింపిక్స్ వేళ టోక్యోను కలవరపెడుతున్న కరోనా