పురుషుల సింగిల్స్‌లో సెర్బియా దిగ్గజ ఆటగాడు జకోవిచ్ ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మూడో రౌండ్లో 6-3, 6-3, 6-1 తేడాతో స్ట్రాఫ్ (జర్మనీ)ను చిత్తుచేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి ఎరుగని జకో.. తనదైన శైలి ఆటతీరుతో ప్రత్యర్థిని వరుస సెట్లలో చిత్తుచేస్తున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడి దూకుడును స్ట్రాఫ్ ఆపలేకపోయాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6-7 (4/7), 6-4, 6-2, 6-2తో మనారినో (ఫ్రాన్స్)పై గెలిచాడు.
ఉత్కంఠ రేపి..
ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్టుగా సాగిన మరో మ్యాచ్‌లో సిట్సిపాస్ (గ్రీస్) 7-6 (7/2), 4-6, 6-4, 5-7, 6-7 (4/7)తో కొరిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడాడు. పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్ అసలైన టెన్నిస్ మజాను అందించింది. 4 గంటల 36 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన పోరులో చివరికి ఆరో ర్యాంకర్ సిట్సిపాస్‌పై 32వ ర్యాంకర్ కొరిచ్ పైచేయి సాధించాడు. మొదటి సెట్‌ను టైబ్రేకర్‌లో సొంతం చేసుకున్న సిట్సిపాస్.. రెండో సెట్ కోల్పోయాడు. ఆ తర్వాత రెండు సెట్లు చెరొకరు గెలిచారు. నాలుగో సెట్‌లో ఆరు మ్యాచ్ పాయింట్లు వృథా చేసిన సిట్సిపాస్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు.
నిర్ణయాత్మకమైన అయిదో సెట్‌లో ఇద్దరు అసాధారణంగా పోరాడటం వల్ల ఫలితం టైబ్రేకర్‌కు వెళ్లింది. అందులో ఆధిపత్యం చలాయించిన కొరిచ్ విజయానందంతో కోర్టు వీడాడు. మిగతా మ్యాచ్‌ల్లో 12వ సీడ్ షపోలోవ్ (కెనడా) 3-6, 6-3, 4-6, 7-6 (7/5), 6-2తో ఫ్రిట్జ్ (అమెరికా)పై పోరాడి గెలిచాడు. మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) నాలుగో రౌండ్ చేరాడు. అతను 6-3, 6-3, 6-2తో వోల్ఫ్ (అమెరికా)ను ఓడించాడు. పదోసీడ్ రుబ్‌లెవ్ (రష్యా) 6-0, 6-4, 6-0తో కరుసో (ఇటలీ)ని చిత్తు చేశాడు. ఏడో సీడ్ గొఫిన్ (బెల్జియం) 6-1, 7-6 (7/5), 6-4తో క్రజినోవిచ్ (సెర్బియా)పై నెగ్గాడు. కారెనో (స్పెయిన్), థామ్సన్ (ఆస్ట్రేలియా) కూడా ముందంజ వేశారు.
నవోమి జోరు..
మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ నవోమి ఒసాకా (జపాన్) జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్లో ఆమె 6-3, 6-7 (4/7), 6-2తో మార్తా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. తొలి సెట్‌ను సులభంగానే సొంతం చేసుకున్న ఒసాకాకు.. రెండో సెట్లో ప్రత్యర్థి ఓటమి రుచి చూపించింది. నిర్ణయాత్మక మూడో సెట్ పోటాపోటీగా సాగుతుందని అనుకున్నారు. కానీ పూర్తిస్థాయిలో చెలరేగిన ఒసాకా.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా పని పూర్తిచేసింది. ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 6-3తో పెగులా (అమెరికా)పై గెలిచింది. దూకుడు కొనసాగించిన ఆమె వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. 3 ఏస్‌లు, 26 విన్నర్లు కొట్టింది. మిగతా మ్యాచ్‌ల్లో కొంటావీట్ (ఇస్తోనియా) 6-3, 6-2తో లినెట్టె (పోలెండ్)పై, మార్టిన్స్ (బెల్జియం) 6-3, 7-5తో సోరిబ్స్ (స్పెయిన్)పై నెగ్గారు. మారియా సకారి (గ్రీస్) 6-3, 6-1తో అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది. బ్రాడీ, రోజర్స్ (అమెరికా) కూడా నాలుగో రౌండ్ చేరారు.
బోపన్న జోడీ శుభారంభం..
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న- షపోలోవ్ (కెనడా) జంట 6-2, 6-4తో స్కొబెడో- రుబిన్ (అమెరికా) ద్వయంపై విజయం సాధించింది. బోపన్న జోడీ రెండో రౌండ్లో ఆరో సీడ్ కెవిన్- మైల్స్ (జర్మనీ)తో తలపడనుంది.