Winter Olympics 2022: చైనాలో ప్రారంభమైన బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో తాజాగా 45 కరోనా కేసులు నమోదైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో 26 మంది కొత్తగా విదేశాల నుంచి వచ్చిన వారు ఉండగా, మిగతా వారు ఇప్పటికే అక్కడికి చేరుకున్న అథ్లెట్లతో పాటు, అక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బంది ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుత కేసుల సంఖ్య అదుపులోనే ఉందని, తాము ఊహించిన దానికంటే ఎక్కువ కాదని నిర్వాహకులు తెలిపారు.
ఈ వింటర్ ఒలింపిక్స్ కోసం జనవరి 23 నుంచి మొత్తం 12 వేల మంది అథ్లెట్లు, వారి సిబ్బంది విదేశాల నుంచి చైనాలో అడుగుపెట్టారు. అందులో మొత్తం 353 కరోనా కేసులు నమోదయ్యాయని వారు పేర్కొన్నారు. మరోవైపు ఈ వింటర్ ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి ఒకే ఒక్క ఆటగాడు ఆరిఫ్ ఖాన్ పాల్గొంటున్నాడు. ఇప్పటికే అతడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం జాతీయ జెండాను చేతబూని స్టేడియంలో భారత బృందాన్ని ముందుకు నడిపించాడు. అతడు స్లాలోమ్, జెయింట్ స్లాలోమ్ విభాగాల్లో స్కీయింగ్ పోటీల్లో పాల్గొననున్నాడు.
ఇదీ చూడండి : ప్రధానిపై విమర్శలు.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌పై నిషేధం