భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ), కోచ్ గెలినా బుఖరినా చెప్పిందే చేస్తానని స్టార్ అథ్లెట్ హిమదాస్ తెలిపింది. వాళ్లు ఓ టోర్నీ ఎంపిక చేసినా.. అందులో పరుగెత్తి ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానని చెప్పింది. గతేడాది ఏప్రిల్‌లో ఆసియా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఈమె వెన్నుకు గాయమైంది. డిసెంబరులో పటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(ఎస్ఐఎస్)కు వచ్చిన హిమ గాయం నుంచి కోలుకుంటోంది.
కరోనా మహమ్మారి కారణంగా టోక్యో ఒలింపిక్స్.. ఏడాది వాయిదా పడటం వల్ల పూర్తిస్థాయి ఫిట్నెస్ సంపాదించేందుకు మెగా క్రీడలకు అర్హత సాధించేందుకు హిమకు సమయం లభించినట్లయింది.
"క్రీడాకారుల జీవితంలో గాయాలు భాగం. ప్రతి ఆటగాడు వీటిని అనుభవిస్తాడు. నేను ఏ టోర్నీలో బరిలో దిగాలో కోచ్, ఏఎఫ్ఐ నిర్ణయిస్తారు. వాళ్లు చెప్పినట్లే చేస్తా. వారి వల్లే ఇప్పుడు నేను ఈ స్థానంలో ఉన్నా. వాళ్లు ఏ టోర్నీ ఎంపిక చేసినా.. అందులో పరుగెత్తి ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తా. లాక్డౌన్ కారణంగా రెండు నెలలు గదికే పరిమితమయ్యా. వ్యక్తిగత ప్రదర్శనపై ఇప్పటికిప్పుడు అంచనాకు రాలేను. పోటీల్లో పాల్గొంటేనే తెలుస్తుంది.ప్రస్తుతానికి ఫిజియోథెరఫీపై దృష్టి సారించా. క్యాంపస్ బయట పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఎన్ఐఎస్లో మా దినచర్య ప్రాక్టీస్- హాస్టల్- ప్రాక్టీస్- హాస్టల్. బయటకు అస్సలు వెళ్లం." అని హిమ వివరించింది.