ఒలింపిక్స్ బెర్త్ కోసం భారత స్టార్ స్ప్రింటర్లు ద్యుతి చంద్, హిమ దాస్ చివరి ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే ప్రపంచ ర్యాంకింగ్స్ కారణంగా విశ్వ క్రీడల్లో పాల్గొనే అవకాశాన్ని వీరు కోల్పోయారు. దీంతో ఆఖరి ప్రయత్నంగా నేటి (శుక్రవారం) నుంచి 5 రోజుల పాటు జరగనున్న జాతీయ అంతర్రాష్ట్ర ఛాంపియన్షిప్లో పాల్గొననున్నారు. దాని ద్వారా ర్యాంకు మెరుగుపరచుకొని టోక్యోకు బెర్తు సాధించాలని చూస్తున్నారు.
ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్(ఐజీపీ) 4లో 0.02 సెకండ్ల తేడాతో టోక్యో అర్హత మార్కు 11.15ను కోల్పోయింది ద్యుతి. 100మీ.ల రేసును 11.17 సెకండ్లలో ముగించి 2019లో తనే నెలకొల్పిన రికార్డును (11.22 సెకండ్లు) తిరగరాసింది. దీంతో ఒలింపిక్స్ కోసం తన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.
దీర్ఘకాలంగా గాయాలతో బాధపడుతోన్న హిమదాస్.. ఐజీపీ 4లో 200మీ.లను 20.88 సెకండ్లతో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన చేసింది. అయితే ఆమె కూడా అర్హత మార్కు 20.80ను అందుకోలేకపోయింది. వీరిద్దరితో పాటు 4x100 రిలేలో అర్చన సుశీంద్రన్, ఎస్ ధనలక్ష్మి ఒలింపిక్స్లో బెర్త్ కోసం శ్రమిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఒలింపిక్స్లో సింధుకు పతకం అంత తేలిక కాదు'