ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసినా.. దాని ఫీవర్ ఇంకా అలాగే ఉంది. సెలెబ్రేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక మెస్సీ పేరు మారుమోగిపోతూనే ఉంది. తాజాగా మెస్సీ గురించి మరో వార్త సంచలనంగా మారింది. సుదీర్ఘ కాలం తర్వాత తమ దేశానికి ఫిపా వరల్డ్ కప్‌ను అందించిన లియోనల్ మెస్సీ ఫొటోను తమ దేశ 1000 పెసో (అర్జెంటీనా కరెన్సీ) నోట్లపై ముద్రించేందుకు నిర్ణయం తీసుకుందట! ఈ మేరకు ఈ విషయాన్ని ఆ దేశ దినపత్రిక ఎల్ ఫినాన్సియరో రాసుకొచ్చింది. ఫిఫా వరల్డ్‌కప్ విజయానికి గుర్తుగా అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, ఈ విషయాన్ని మిగతా పత్రికలు కొట్టిపారేశాయి.
ఫిఫా ఫైనల్ ముగియక ముందు నుంచే ఈ రకంగా అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ సన్నాహాలు చేసిందని పత్రిక పేర్కొంది. దీంతో అర్జెంటీనా కరెన్సీపై మెస్సీ ఫొటోతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇదంతా జోక్లాగానే సెంట్రల్ బ్యాంక్‌కు సూచించాం అని ఆ పత్రిక చెప్పుకొచ్చింది. దీనిపై స్పందించిన బ్యాంకు డైరెక్టర్లలో ఒకరు లిసాండో క్లేరీ.. అది మంచి ఆలోచనే అని చెప్పారని పత్రిక పేర్కొంది. అయితే ఇలా చేయడం మొదటి సారి కాదు. అర్జెంటీనా 1978లో మొదటి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా స్మారక నాణేలు విడుదల చేశారు. ఇక ఫిఫా ఫైనల్లో మెస్సీ అధ్భుత ప్రదర్శన చేశాడు. దీంతో షూటౌట్లో ఫ్రాన్స్‌పై 4-2 గోల్స్ తేడాతో గెలిచి మూడోసారి జగజ్జేతగా నిలిచింది అర్జెంటీనా