టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డు బద్దలుగొట్టాడు. దిల్లీ వేదికగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో విరాట్ రాణించాడు. టీమ్ఇండియా తొలి, రెండో ఇన్నింగ్స్‌లో 44, 20 పరుగులు చేశాడు. దీంతో, ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 25,000 పరుగులు సాధించిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇదివరకు ఈ రికార్డు టీమ్ఇండి మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ పేరిట ఉండేది.
ఈ ఫీట్‌ను కోహ్లీ 549 ఇన్నింగ్స్‌లో పూర్తి చేయాగా.. 25,000 పరుగులు పూర్తి చేయడానికి సచిన్ తెందుల్కర్‌కు 579 ఇన్నింగ్స్‌లు పట్టాయి. ఇప్పటివరకు కోహ్లీ.. వన్డేల్లో 12,809 సాధించాడు. టెస్టుల్లో 8,495.. టీ20ల్లో 4008 పరుగులు చేశాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో 20 పరుగులు చేసి.. మొత్తంగా 25,012 పరుగులు పూర్తి చేశాడు. ఇక. అత్యంత వేగంగా 25 వేల పరుగుల పూర్తి చేసిన లిస్టులో విరాట్ కోహ్లీ, సచిన్ తెందుల్కర్ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ రికీ పాంటింగ్..(588 ఇన్నింగ్స్), జాక్స్ కాలిస్(594 ఇన్నింగ్స్), కుమార సంగాక్కర(608 ఇన్నింగ్స్), మహేల జయవర్ధనే(701 ఇన్నింగ్స్) ఉన్నారు. ఇదే కాకుండా వన్డేల్లో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
కాగా, దిల్లీ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో కొంచెం తడబడ్డా.. రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుంది. కంగారూ బ్యాటర్లును భారత బౌలర్లలు అష్టదిగ్బంధనం చేసి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 113 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు.
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 263/10
- ఇండియా తొలి ఇన్నింగ్స్ : 262/10
- ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 113/10
- ఇండియా రెండో ఇన్నింగ్స్ : 118/4