అప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 20 ఏళ్ల యువకుడు. పట్టుమని పది మ్యాచ్‌లు ఆడలేదు. ఇంతలోనే విమర్శల వర్షం. నువ్వు క్రికెట్‌కు పనికిరావు, బద్దకస్తుడివి, నీ ఫుట్‌వర్క్ బాగోలేదు. నీకు జట్టులో చోటు కష్టం. వీటికి తోడు వరుస వైఫల్యాలు.. 2011 వన్డే ప్రపంచకప్ ఎంపిక కాని పరిస్థితి. కట్ చేస్తే.. 15 ఏళ్లు తిరిగేసరికి... భారత క్రికెట్‌లో ఇప్పుడు అతడొక సూపర్‌స్టార్. అన్ని ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు సారథి. క్రికెటర్లు సైతం అతడి అభిమానులే. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరికి సాధ్యం కాని రికార్డులు... మరెన్నో ఘనతలు సాధించిన ఆ క్రికెటరే.. అభిమానులు ముద్దుగా పిలిచే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా అతడిపై ప్రత్యేక కథనం.
ఆట అలా మొదలైంది..: రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి 2006లో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో 2007 ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. జూన్ 23న బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. అయితే, బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అదే ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో సౌతాఫ్రికాతో కీలక మ్యాచ్.. భారత్ స్కోరు 61/4.. ఇటువంటి పరిస్థితుల్లో ధోనీ (45)తో కలిసి రోహిత్ 50(40 బంతుల్లో 7x4, 2x6) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరు 150 దాటడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించడంతోపాటు రోహిత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి 16బంతుల్లోనే 30 పరుగులు చేసి మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
వరుస వైఫల్యాలు: రోహిత్ కెరీర్‌లో 2008 నుంచి 2012 వరకు గడ్డుకాలం అని చెప్పొచ్చు. వరుస వైఫల్యాలతో జట్టులో చోటు కోల్పోయాడు. 2011లో రాణించినా వరల్డ్‌కప్‌నకు ముందు జరిగిన సౌతాఫ్రికా సిరీస్‌లో విఫలం అయ్యాడు. దీంతో ప్రపంచకప్‌నకు ఎంపిక కాలేదు. 2012లో 14 వన్డేల్లో 168 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. ఐదేళ్లపాటు రోహిత్ కెరీర్ ఇలా అనేక ఇబ్బందులతో సాగింది.
ధోనీ దారి చూపాడు: 2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. అప్పటి వరకు మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్‌కు.. ధోనీ ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాడు. ఈ టోర్నీలో శిఖర్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్‌లు ఆడి టీమ్‌ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్ ఓపెనర్‌గా 5 మ్యాచ్‌ల్లో 177 పరుగులు చేశాడు. వీటిలో రెండు అర్ధ శతకాలున్నాయి. 2013లో మొత్తం 28 వన్డే మ్యాచ్‌ల్లో 52 సగటుతో 1196 పరుగులు చేశాడు. వీటిలో 2 శతకాలు, 8 అర్ధ శతకాలు ఉండటం విశేషం. అప్పటివరకు రోహిత్ వన్డేల్లో 23 సిక్సర్లు కొడితే.. ఒక్క 2013లోనే 30 సిక్సర్లు బాదేశాడు.
టెస్ట్ క్రికెట్‌లోనూ..: అప్పటి నుంచి ఓపెనర్‌గా ప్రతి ఏడాది టన్నుల కొద్ది పరుగులు చేస్తూ టీమ్‌ఇండియాలో కీలక బ్యాటర్‌గా ఎదిగాడు. 2013లో కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో భారీ శతకం (177) చేశాడు. తర్వాత టెస్టుల్లో నిలకడగా రాణించలేక జట్టులో చోటు కోల్పోయాడు. 2019లో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ 4 ఇన్నింగ్స్‌ల్లో 529 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యాడు. దీంతో టెస్టు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2021లో ఇంగ్లాండ్‌తో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (127) చేయడంతో విదేశీ గడ్డపై తన తొలి సెంచరీ చేశాడు. 2021లో భారత తరఫున అత్యధిక పరుగులు (906) పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలున్నాయి.
రోహిత్ రికార్డులను బద్దలు కొట్టగలరా!
- వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ రోహిత్. 2014 కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రెచ్చిపోయాడు. (264; 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్స్‌లు) వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు, ఒక ఇన్నింగ్స్‌లో బౌండరీల ద్వారా అత్యధిక స్కోరు (186) నమోదు చేశాడు.
- 2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు (648 పరుగులు) చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు ఇవే.
- భారత టీ20 లీగ్‌లో ముంబయి జట్టుకి సారథ్యం వహిస్తున్న హిట్‌మ్యాన్.. ఇప్పటివరకు 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఎవరూ ఈ ఘనత సాధించలేదు.
సారథిగా సాగిపో..: 2011 వన్డే వరల్డ్‌కప్‌లో చోటే దక్కని ఆటగాడు.. 2023 ప్రపంచకప్‌కు భారత జట్టుకు నాయకత్వం వహిస్తే... టెస్టు జట్టులో తన స్థానం ప్రశ్నార్థకం అయిన ప్లేయర్... భారత టెస్టు జట్టుకు నాయకుడు అయితే... అవును ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న రోహిత్ ఇప్పుడు ఈ ఘనతలను సాధించాడు. ఇదే స్ఫూర్తితో అతడు సారథిగా భారత జట్టుకు ప్రపంచకప్ తీసుకొస్తే అతడి కెరీర్‌లో అదొక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. ఆ ముచ్చట తీరాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి: రోహిత్ శర్మ @15 ఇయర్స్.. ఆ రికార్డులు హిట్‌మ్యాన్‌కే సొంతం