టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final) టీమ్‌ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్వింగయ్యే బంతిని ఆడటానికి కష్టపడొచ్చని కివీస్ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు(IND vs NZ) ఏజియస్ మైదానంలో ఛాంపియన్‌షిప్ తుదిపోరులో తలపడనుంది. మరోవైపు ఆ ఫైనల్ మ్యాచ్‌కు ఫాస్ట్, బౌన్సీ పిచ్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే పిచ్ క్యూరేటర్ సైమన్ లీ మీడియాకు వివరించడం వల్ల అది రోహిత్‌ను ఇబ్బంది పెట్టొచ్చని స్టైరిస్(Scott Styris) వెల్లడించాడు.
"రోహిత్ ఎలా ఆడతాడనేది పిచ్‌మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బంతి స్వింగైతే అతడికి కష్టాలు తప్పకపోవచ్చు. బ్యాటింగ్ చేసేటప్పుడు ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపు హిట్‌మ్యాన్ క్రీజులో కాళ్లు కదపడు. అదే జరిగితే బౌలర్లు స్వింగయ్యే బంతులేస్తే అతడు ఇబ్బందులు పడే అవకాశముంది. ఇక న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలింగ్ విషయంలోనూ ఏ దాపరికం లేదు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ ఆడే అవకాశం ఉంది. జేమీసన్ లేదా డి గ్రాండ్‌హోమ్ మూడో పేసర్‌గా ఉండొచ్చు. తర్వాత నీల్‌వాగ్నర్ ఉన్నాడు. అతడు మధ్య ఓవర్లలో కోహ్లీ లాంటి వికెట్లు తీయొచ్చు" అని స్టైరిస్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి.. 'రహానె సూచనలతో మానసికంగా సిద్ధమయ్యాం!'