Lord Shardul: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో చెలరేగి.. సఫారీల పతనాన్ని శాసించిన శార్దూల్ ఠాకూర్ పేరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మారు మోగుతోంది. 'లార్డ్ శార్దూల్..'పై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా శార్దూల్ ఠాకూర్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. అతడిని అందరూ 'లార్డ్ శార్దూల్' అనే ముద్దు పేరుతో పిలుస్తుంటారు. ఆ పేరు వెనుక ఉన్న కారణాలేంటో శార్దూల్ వివరించాడు.
"లార్డ్' అనే పేరు ఎవరు పెట్టారో తెలియదు. కానీ, గతేడాది ఆస్ట్రేలియా పర్యటన అనంతరం.. భారత్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సమయంలో ఆ పేరు సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అయ్యింది. ఆ సిరీస్‌లో నేను మెరుగ్గా రాణించాను. ఒకే ఓవర్లో రెండేసి వికెట్లు పడగొట్టాను. అందుకే, అప్పటి నుంచి ఆ పేరు బాగా ఫేమస్ అయ్యిందనుకుంటున్నాను" అని శార్దూల్ పేర్కొన్నాడు.
కాగా, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శార్దూల్ ఠాకూర్ (7/61) సంచలన ప్రదర్శన చేయడంపై క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సహా రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, ఇర్పాన్ పఠాన్ తదితరులు అభినందనలు తెలిపారు.
"వైవిధ్యమైన బౌలింగ్‌తో ఏడు వికెట్లు తీసిన శార్దూల్‌కు అభినందనలు" అని సచిన్ ట్వీట్ చేశాడు. సచిన్ ట్వీట్‌పై స్పందించిన శార్దూల్ సంతోషం వ్యక్తం చేశాడు. "క్రికెట్ దేవుడే స్వయంగా నా గురించి ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నేను కూడా ముంబయి ఆటగాడినే. ముంబయి తరఫున ఆయనతో కలిసి గతంలో కొన్ని మ్యాచులు ఆడాను. నాకెప్పుడూ మద్దతుగా నిలిచారు. నేను ఎప్పుడైనా.. పూర్తి ఆత్మ విశ్వాసంతో మైదానంలోకి అడుగుపెడతాను. ఇదే నా విజయ రహస్యమని భావిస్తాను. గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతాను. ఇక ముందు కూడా ఇదే కొనసాగించాలనుకుంటున్నాను" అని శార్దూల్ ఠాకూర్ తెలిపాడు.