Rohit Sharma Inspiration: ప్రస్తుతం టీమ్ఇండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు రోహిత్ శర్మ. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ముంబయి ఇండియన్స్ జట్టును ముందుండి నడిపించి.. ఇప్పటికే ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ఐపీఎల్లో ముంబయి జట్టుకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ మెంటార్‌గా సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ గురించి మాట్లాడాడు హిట్ మ్యాన్. సచిన్ ఆటను చూస్తూ పెరిగానని.. క్రికెట్ ఆడటంలో ఆయనే స్ఫూర్తి అని వెల్లడించాడు. మైదానం లోపలా, బయటా సచిన్‌ను అనుసరిస్తానని చెప్పాడు.
''సచిన్ తెందుల్కరే ఎప్పటికీ నాకు స్ఫూర్తి. నాకు తెలిసినప్పటినుంచి సచిన్ ఆటను చూస్తున్నాను. దగ్గరుండి కూడా సచిన్ గేమ్‌ను చూశా. ఆయన ఎన్నో ఘనతలు సాధించాడు. క్రికెట్ ఆడటం విషయానికి వస్తే.. ఆ రికార్డుల్ని ఎవరైనా అందుకోగలరని నేను అనుకోవట్లేదు. దాదాపు 25 ఏళ్లు.. జట్టు బాధ్యతను తన భుజస్కందాలపై మోశాడు. అది అంత సులభమేం కాదు. క్రికెటర్‌గా ఎన్నో సాధించినా.. ఎంతో వినయంగా ఉంటాడు.''
- రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్
2022 ఐపీఎల్ విషయానికి వస్తే.. ముంబయిలో ఆడుతుండటం తమకు పెద్దగా ప్రయోజనమేమీ చేకూర్చదని ఉద్ఘాటించాడు రోహిత్. జట్టులో చాలా మంది కొత్తవారేనని, అయినా ముంబయిలో ఆడక చాలా రోజులైందని చెప్పాడు. ''నేను, సూర్య కుమార్ యాదవ్ మాత్రమే ముంబయికి చెందినవాళ్లం. మిగతావారంతా కొత్తోళ్లే. వారికి ఇక్కడ ఆడిన అనుభవం లేదు. ఒకవేళ గతేడాది ఐపీఎల్ ముంబయిలో ఉంటే అది ప్రయోజనం అని చెప్పేవాడిని. ఎందుకంటే అప్పుడు చాలా మందికి ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. కానీ ఇప్పుడు కాదు.'' అని రోహిత్ వివరించాడు.
ప్రస్తుత ఐపీఎల్‌కు ముందు మెగా వేలం జరిగింది. చాన్నాళ్లుగా ముంబయికి ఆడిన హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, డికాక్ సహా పలువురు ఇతర జట్లకు వెళ్లారు. ముంబయి ఇండియన్స్‌లో రోహిత్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, బుమ్రా, పొలార్డ్ మినహా అంతా కొత్తవారినే తీసుకుంది యాజమాన్యం. అయితే.. ఈ ఐపీఎల్లో ముంబయి ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. తొలుత దిల్లీ క్యాపిటల్స్, తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో ఓడిపోయింది. బుధవారం.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు పుణె ఎంసీఏ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
ఇవీ చూడండి: 'మాకేం ప్రయోజనం? అక్కడ ఆడి రెండేళ్లు అవుతుంది'