SRH Playoffs Chances 2023 : ఐపీఎల్-16వ సీజన్‌లో తడబడుతూ ఆడుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్. ఈ క్రమంలో ఆదివారం రాజస్థాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. చివరి బంతి నోబాల్ కారణంగా వరించిన ఈ విజయం.. మార్‌క్రమ్ సేనలో ఫుల్ జోష్‌ను నింపింది. దీంతో ప్లేఆప్స్ రేసులో ఇంకా తమకు అవకాశాలు ఉన్నాయని నిరూపించుకుంది. పాయింట్ల పట్టికలో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకున్న ఆ జట్టు.. 8 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సిన నేపథ్యంలో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్. గొప్ప ఆటగాళ్లున్న టీమ్ అన్న పేరు మాత్రమే కానీ.. ఆచరణలో మాత్రం ఫలితాలు నిరాశను కలిగిస్తున్నాయి. ఈ సీజన్‌లో హైదరాబాద్ పరిస్థితి మొదటి నుంచీ అంతంత మాత్రంగానే ఉంది. నిలకడగా ఆడే ఆటగాళ్లు లేకపోవడం వల్ల.. వరుసగా మ్యాచుల్లో ఓటమిపాలౌతోంది. ఈ క్రమంలో గెలిచే అవకాశాలున్న మ్యాచ్‌లనూ చేజేతులా పోగొట్టుకుంది. కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో విజయానికి 9 పరుగులు చేయాల్సిన స్థితిలోనూ చేతులెత్తేసింది. దీంతో తన ప్లే ఆఫ్స్ చేరేందుకు ఉన్న అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది. అయితే నిన్న గుజరాత్‌పై లభించిన థ్రిల్లింగ్ విక్టరీ ఆ జట్టులో ప్లే ఆఫ్స్ ఆశలను చిగురింపజేసిందనే చెప్పాలి.
ఆ ఒక్కటి సరిపోదు..
ఇప్పటివరకూ పది మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్.. నాలుగు విజయాలను నమోదు చేసి 8 పాయింట్లతో తొమ్మిదే స్థానంలో ఉంది. ఇప్పటివరకూ పంజాబ్, కోల్‌కతా, దిల్లీ, రాజస్థాన్‌ల జట్లపై మాత్రమే గెలిచిన మర్క్రమ్ జట్టు.. ఇంకో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటన్నింటిలో గెలిస్తే 16 పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు తొలి నాలుగు స్థానాల్లో నిలిచే అవకాశం ఉంటుంది. అయితే.. మిగతా మ్యాచ్‌ల్లో భారీ రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంటుంది. మరోవైపు అదే సమయంలో మిగతా జట్ల మ్యాచ్‌ల ఫలితాలు కూడా హైదరాబాద్‌కు అనుకూలంగా ఉండాలి. అప్పుడే ప్లే ఆఫ్స్‌లోకి చేరే అవకాశం ఉంటుంది.
కఠినమైన ప్రత్యర్థులతో..
మున్ముందు హైదరాబాద్ ఆడబోయే మ్యాచులు అత్యంత కఠినమైన ప్రత్యర్థులతోనే ఉన్నాయి. లఖ్‌నవూ, గుజరాత్, బెంగళూరు, ముంబయి జట్లతో ఎస్‌ఆర్‌హెచ్ తలపడాల్సి ఉంది. వీటిల్లో లఖ్‌నవూ, ముంబయి జట్లతో హైదరాబాద్ ఇదివరకే ఓడిపోయింది. తదుపరి మ్యాచ్‌లలో వీటిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇక ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్‌లను గెలిచి వరుస విజయాలతో దూసుకెళ్తూంది. 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంతటి బలమైన జట్టును ఢీకొని హైదరాబాద్ ఎలా రాణిస్తుందో చూడాలి. అయితే.. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా.. హైదరాబాద్ ప్లే ఆఫ్స్రేసులోకి ప్రవేశించడం కాస్త కష్టమే.