కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన మనసులో మాట చెప్పేశాడు. వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్, బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్‌ల ఆట ఇంచుమించు ఒకటే అని అన్నాడు.
2020 సీజన్‌లో నరైన్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటం వల్ల షకిబ్ వైపే మోర్గాన్ మొగ్గుచూపుతాడని అనిపిస్తోంది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు, వన్డేల్లో షకిబ్ ప్రదర్శన బాగుంది. ఇక నరైన్ ఆడిన గత మ్యాచుల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదు. ఈ విషయాలు కూడా జట్టు కూర్పు ముందు చర్చకు రావచ్చు. కోల్‌కతాకు హర్భజన్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిల రూపంలో స్పిన్ వనరులు పుష్కలంగా ఉండటం వల్ల జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది.
ఎనిమిది సీజన్లుగా నరైన్ కోల్‌కతాకు ఓ మంచి బ్యాటింగ్ వనరుగా కూడా ఉపయోగపడుతున్నాడు. ఇక షకిబ్ ఆల్‌రౌండ్ ప్రతిభ ఎలాంటిదో కూడా చెప్పనక్కర్లేదు. అయితే షకిబ్ ఈ ఏడాదే కోల్‌కతా జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరు తుది జట్టులో ఉంటారన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. కాగా, ఈరోజు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.