కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. నాలుగు ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లకు వైరస్ సోకడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు లీగ్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్. అలాగే టోర్నీని మళ్లీ ఎప్పుడు నిర్వహించనున్నామన్న విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపారు. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు విషయాలు పంచుకున్నారు.
ఐపీఎల్‌ను వాయిదా వేయడం కష్టమైన పని కదా?
ఐపీఎల్ వాయిదా వేయడమనేది చాలా కష్టమైన పని. కానీ లీగ్‌లో పాల్గొన్న నాలుగు జట్లకు చెందిన ఆటగాళ్లు వైరస్ బారినపడ్డారు. దిల్లీ, కోల్‌కతా, సన్‌రైజర్స్, చెన్నైకి చెందిన క్రికెటర్లు/సిబ్బందిరి కరోనా సోకింది. ఇలా నాలుగు జట్ల ఆటగాళ్లకు కరోనా రావడం వల్ల మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయడం వీలుకాదు. భారత్‌లో నెలకొన్న పరిస్థితులను చూశాక ప్రస్తుతానికి వాయిదా వేయడమే మంచిదని అనిపించింది.
లీగ్‌ను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలని అనుకుంటున్నారు?
మిగిలిన 31 మ్యాచ్‌లు ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు నిర్వహిస్తాం. ఇప్పుడు ఎక్కడ అయితే లీగ్ ముగిసిందో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. టీ20 ప్రపంచకప్ ముందా? లేక తర్వాత నిర్వహించాలా అనేది త్వరలో నిర్ణయిస్తాం.
వాయిదాకు ముందు ఇంకేమైనా అనుకున్నారా?
ముందుగా మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేద్దామని అనుకున్నాం. రెండు జట్లకు చెందిన ఆటగాళ్లు వైరస్ బారిన పడితే ఇది వీలుపడేది. కానీ నాలుగు జట్లలో పాజిటివ్ రావడం వల్ల అది చాలా కష్టమైన పని. ఆటగాళ్లు, సిబ్బంది, కామెంటేటర్స్ అందరి రక్షణ దృష్ట్యా వాయిదా వేయడమే ఉత్తమమని అనుకున్నాం.
బయోబబుల్ సురక్షితమని అందరూ అనుకున్నారు. కానీ ఇంతటి కఠిన బబుల్ నడుమ ఆటగాళ్లకు కరోనా ఎలా వచ్చింది?
నాకు తెలియదు. కొవిడ్ మొదటి విడత సమయంలో భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరిస్తే చాలని అనుకున్నాం. కానీ సెకండే వేవ్‌లో వైరస్ గాలి ద్వారా కూడా సోకుతోంది. బబుల్‌లోని వారికి ఎలా వైరస్ వచ్చిందో తెలియదు. కానీ బయోబబుల్ చాలా సురక్షితం. దీనిపై మేము సమీక్ష చేస్తాం.
స్కానింగ్ కోసం వెళ్లిన వరుణ్ చక్రవర్తి విషయంలో బయోబబుల్ ఉల్లంఘన జరిగిందా? తర్వాత అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడా? అసలు ఏం జరిగింది?
అతడు స్కానింగ్ కోసం వెళ్లాడు. అతడికి అక్కడే వైరస్ సోకిందనేది చెప్పలేం. చాలా వరకు స్కానింగ్ సెంటర్స్ ద్వారా వైరస్ సోకవచ్చు. అసలు ఏం జరిగింది? అతడికి ఎలా వైరస్ సోకిందనే విషయంపై సమీక్ష చేస్తాం.
విదేశీ ఆటగాళ్లను వారి ఇళ్లకు పంపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. బీసీసీఐ నుంచి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాం.