IPL 2023 LSG VS MI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ముంబయి ఇండియన్స్-లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య కీలక ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. అద్భుత ప్రదర్శన కనబర్చిన ముంబయి జట్టు 81 పరగులతో తేడాతో లఖ్‌నవూను చిత్తుచేసింది. ముంబయి నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ.. 16.3 ఓవర్ల ముగిసేసరికి 101 పరగులు మాత్రమే చేసి కుప్పకూలింది. మార్కస్ స్టొయినిస్ 40 పరుగులు చేసి మెరిశాడు. కైల్ మేయర్స్ (18), దీపక్ హుడా (15) పరుగులతో ఫర్వాలేదనిపించారు. కృనాల్ పాండ్య(8), పేరక్ మన్కడ్(3), ఆయుష్ బడోని(1), నికోలస్ పూరన్ (0), కృష్ణప్ప గౌతమ్ (2*), రవి బిష్ణోయ్ (3), నవీన్ ఉల్ హక్ (1*), మోషిన్ ఖాన్(0) పేలవ ప్రదర్శన చేశారు. ముంబయి బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 5 వికెట్లతో చెలరేగిపోయాడు. క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా తలో వికెట్ తీశారు.
అంతకుముందు, మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ (41; 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (33; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాగానే రాణించారు. చివర్లో నేహల్ వధేరా (23; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (26; 22 బంతుల్లో 2 సిక్స్‌లు) కూడా ఫర్వాలేదనిపించాడు. ఇషాన్ కిషన్ (15), రోహిత్ శర్మ (10), టిమ్ డేవిడ్ (13) విఫలమయ్యారు. లఖ్‌నవూ బౌలర్లలో నవీనుల్ హక్ 4 వికెట్లతో మెరిశాడు. యశ్ ఠాకూర్ 3 వికెట్లతో ఆకట్టుకోగా.. మోసిన్ ఖాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
మధ్వాల్ నయా రికార్డ్..
తన అద్భుత ప్రదర్శనతో ముంబయిని విజయ తీరాలకు చేర్చాడు ఆకాశ్ మధ్వాల్. ఈ ప్రదర్శనతో నయా రికార్డును నమోదు చేశాడు. 3.3 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు ఇచ్చాడు. దీంతో మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. 2009లో ఆర్సీబీ తరఫున ఆడిన కుంబ్లే.. 5 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇదే ముంబయి జట్టు నుంచి 2013లో దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు లసిత్ మలింగ. అయితే, 24 ఏళ్ల వరకు టెన్నిస్ బాల్ క్రికెట్‌కు పరిమితమైన మధ్వాల్.. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌లో కీలక బౌలర్‌గా మారాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చూడండి: IPL Dhoni Retirement : మహీ మనసులో ఏమున్నట్టు.. ఒక్కోసారి ఒక్కోలా!