Virat Kohli: ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ అత్యంత ప్రతిభావంతుల్లో ఒకడని టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైనట్లు పేర్కొన్నాడు. పెద్ద టోర్నీల్లో నిలకడగా రాణించలేకపోతున్నాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ మాదిరిగా భారీ స్కోర్లు సాధించాలంటే మాత్రం శాంసన్ మరింత క్రమశిక్షణతో గేమ్‌ను ఆడాలని రవిశాస్త్రి సూచించాడు.
"ప్రస్తుతం జరుగుతున్న టీ20 లీగ్‌లో సంజూను గమనిస్తున్నా. ఎంతో కామ్‌గా ముందుకెళ్తున్నాడు. పరిణితి వృద్ధి చేసుకున్నాడు. ఈసారి ఎంతో స్థిరంగా పరుగులు చేస్తాడని భావిస్తున్నా. తన సహజసిద్ధమైన ఆటతో భారీ స్కోర్లు చేయగలడు. అయితే ప్రత్యర్థి బౌలర్లను చదవడం సంజూ నేర్చుకోవాలి. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాదిరిగా ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయించి దేశం కోసం ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు"
-రవిశాస్త్రి, మాజీ హెడ్ కోచ్
ప్రస్తుతం సంజూ సారథ్యంలోని రాజస్థాన్ (4) మూడింట్లో రెండు మ్యాచ్‌లను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
సంజూకు ఆ సత్తా సంజూకు ఉంది: టీమ్‌ఇండియా తరఫున చాలా మ్యాచ్‌లను ఆడగలిగే సత్తా సంజూ శాంసన్‌కు ఉందని పాక్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. "అద్భుతమైన ఆటగాళ్లలో సంజూ ఒకడు. దురదృష్టవశాత్తూ భారత జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. అయితే టీమ్‌ఇండియా తరఫున అత్యధిక మ్యాచ్‌లను ఆడగలిగే సత్తా సంజూకు ఉందని నా అభిప్రాయం" అని అక్తర్ వివరించాడు.
ఇదీ చూడండి: 'అది మాకు కలిసొచ్చే అంశం.. ఐపీఎల్ ట్రోఫీ మాదే'