చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రెండో దశలో ఇప్పటికే రెండు విజయాలు సాధించి జోరుమీదున్న సీఎస్కే.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ జయకేతనం ఎగరేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(40;28బంతుల్లో 2×4, 3×6), డుప్లెసిస్ (43; 30 బంతుల్లో 7×4) రాణించగా.. కోల్‌కతా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అదరగొట్టిన ఓపెనర్లు..
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన డుప్లెసిస్.. తర్వాత వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్లోనూ ఇదే సీన్ రిపీట్ చేశాడు. సునీల్ నరైన్ వేసిన ఐదో ఓవర్‌లో గైక్వాడ్ ఓ సిక్స్, ఫోర్ బాదాడు. దూకుడుగా ఆడుతున్న రుతురాజ్‌ను రసెల్ 9వ ఓవర్లో వెనక్కి పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ(35; 28బంతుల్లో 2×4, 2×6) ఫర్వాలేదనిపించాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 11.3 ఓవర్‌కు డుప్లెసిస్ ఔటయ్యాడు. అంబటి రాయుడు(10)ను సునీల్ నరైన్ పెవిలియన్ చేర్చాడు. ఫెర్గూసన్ వేసిన 17వ ఓవర్‌లో మొయిన్ అలీ వెంకటేశ్ అయ్యర్‌కి చిక్కాడు. రైనా(11), ధోనీ(1) ఔటవడం వల్ల చివర్లో ఉత్కంఠ నెలకొంది. జడేజా (22; 8బంతుల్లో 2×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. కోల్‌కతా బౌలర్లలో రసెల్, ఫెర్గూసన్, ప్రసిద్ధ్ కృష్ణ, చక్రవర్తి, నరైన్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్ (9)ని రాయుడు రనౌట్ చేశాడు. తర్వాత వెంకటేశ్ అయ్యర్ (18)తో కలిసి త్రిపాఠి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. సామ్‌కరన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో త్రిపాఠి సిక్స్, ఫోర్ బాదాడు. హేజిల్ వుడ్ వేసిన తర్వాతి ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ రెండు ఫోర్లు కొట్టాడు. ఆరో ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ వెంకటేశ్ అయ్యర్‌ను ఔట్ చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తర్వాత స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. మోర్గాన్ (8) నిరాశపర్చగా.. జడేజా వేసిన 13వ ఓవర్లో త్రిపాఠి క్లీన్‌బౌల్డయ్యాడు. అనంతరం రసెల్ (20; 15 బంతుల్లో 2×4, 1×6) వేగంగా ఆడబోయి 17వ ఓవర్లో ఔటయ్యాడు. దినేశ్ కార్తీక్ (26; 11 బంతుల్లో 3×4, 1×6) చివర్లో దూకుడుగా ఆడాడు. దీపక్ చాహర్ వేసిన 18వ ఓవర్‌లో రాణా రెండు ఫోర్లు బాదాడు. సామ్‌కరన్ వేసిన 19వ ఓవర్లో దినేశ్ కార్తీక్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. హేజిల్‌వుడ్ వేసిన చివరి ఓవర్‌లో కార్తీక్ ఔటయ్యాడు. మొత్తంగా కోల్‌కతా 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో హేజిల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్ రెండు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
ఇదీ చూడండి: IPL 2021: 'అందుకే అతడు మెంటార్ సింగ్ ధోనీ'