తమ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటారు క్రికెటర్లు. సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు.. మరెన్నో విమర్శలు. ఇలా ప్రతి ఆటగాడి కెరీర్ ఎన్నో మలుపులు తీసుకుంటుంది. అయితే కొంతమంది ఆటగాళ్లు.. తమ క్రికెట్ ప్రస్థానాన్ని విచారకరంగా, విమర్శలతో ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో క్రికెట్ జర్నీని ఇలా అర్ధాంతరంగా ముగించిన వారెవరో తెలుసుకుందామా..?
ఎన్నో విమర్శల మధ్య..
ప్రస్తుతం పంజాబ్ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారిన పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఒకప్పుడు క్రికెటర్‌గా భారత జట్టుకు సేవలందించాడు. అయితే.. క్రికెట్ జట్టు నుంచి అర్ధాంతరంగా ఆయన వైదొలిగిన తీరు అప్పట్లో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఆనాటి రిపోర్టుల ప్రకారం.. అప్పటి భారత ఆటగాడు అజిత్ వాడేకర్.. సిద్ధూను అన్‌ఫిట్ అని , అతడి స్థానంలో వేరొక ఆటగాడికి అవకాశం ఇవ్వాలన్నట్లు సమాచారం. వాడేకర్ వ్యాఖ్యలకు సిద్ధూ ఎంతగానో బాధపడ్డాడట. మరో ఘటనలో సిద్ధూ వరల్డ్‌కప్ ఆడేందుకు ఉత్తీర్ణత సాధించలేదని అజారుద్దీన్ అన్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే భారత జట్టును సిద్ధూ ఫెయిల్ చేశారా? లేక భారత జట్టే సిద్ధూను ఫెయిల్ చేసిందా? తెలియదు కానీ.. ఆయన మాత్రం అర్ధాంతరంగానే రిటైర్మెంట్ ఇచ్చాడు.
ఆ పర్యటనే కారణమా..?
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. ఒక్కసారిగా తన క్రికెట్ ప్రస్థానాన్ని ముగించటానికి గల కారణం ఏంటో ఇప్పటికీ చాలామందికి తెలియని ప్రశ్న. అయితే కొన్ని రిపోర్టుల ప్రకారం.. 2011 ఆస్ట్రేలియా పర్యటనలో అతడి పేలవమైన ప్రదర్శనే రిటైర్మెంట్కు దారితీసిందట. టోర్నీ మొత్తంలో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన లక్ష్మణ్.. కేవలం రెండు అర్ధశతకాలే నమోదుచేశాడు. ఆ టూర్ తర్వాత లక్ష్మణ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆఖరికి క్రికెట్ నిపుణులు కూడా.. లక్ష్మణ్‌కు రిటైర్మెంట్ సమయం ఆసన్నమైందని ఆరోపించారట. ఈ ఘటనలకు తీవ్ర ఆవేదన చెందిన లక్ష్మణ్.. రిటైర్మెంట్ ప్రకటించాడు.
కుటుంబం కోసం..
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌కు 'ఇంగ్లాండ్ గ్రేటెస్ట్ మోడ్రన్ బ్యాట్స్‌మెన్'గా అభివర్ణించింది ది గార్డియన్ పత్రిక. 'ది మోస్ట్ కంప్లీట్ బ్యాట్స్‌మెన్ ఇన్ క్రికెట్'గా టైమ్స్ పత్రిక పొగిడింది. అయితే ఇతడు 2018లో జట్టు నుంచి వైదొలగడం.. ఎంతో మంది అభిమానులను షాక్‌కు గురిచేసింది. రిటైర్మెంట్ సమయంలో.. ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచినందుకు కెవిన్ పీటర్సన్ తన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. మిగతా సమయాన్ని తన కుటుంబం కోసం గడపాలనుకుంటున్నానని చెప్పాడు.
గుండె సంబంధిత వ్యాధితో..
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ టేలర్‌కు అత్యద్భుత ఫీల్డర్‌గా పేరుంది. అయితే గుండె సంబంధిత వ్యాధి కారణంగా టేలర్ అర్ధాంతరంగా తన క్రికెట్ జర్నీకి ముగింపు పలికాడు. దీంతో టేలర్ అభిమానులకు నిరాశ తప్పలేదు.
నల్లబ్యాండ్తో ఆడి..
జింబాబ్వే మాజీ పేసర్ హెన్రీ ఓలోంగా.. 2003 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో చేతికి నల్లబ్యాండ్ ధరించి ఆటలో పాల్గొన్నాడు. జింబాబ్వేలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని చెబుతూ.. ఈ చర్యకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన ఆ దేశ ప్రభుత్వం.. ఏకంగా హెన్రీను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఒత్తిడి కారణంతో..
ఇంగ్లాడ్ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ జొనాతన్ ట్రాట్.. తీవ్రమైన ఒత్తిడి కారణంగా త్వరగానే క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. 2015లో వెస్టిండీస్‌తో సిరీస్ కోల్పోయాక ట్రాట్పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇతడు అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఒత్తిడి, తొందరపాటు సమస్యల కారణంగానే తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లు తర్వాత తెలిపాడు ట్రాట్.
కైఫ్ రిటైర్మెంట్..
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. అద్భుతమైన ఫీల్డర్‌గా పేరుగాంచాడు. భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించడంలో కృషిచేశాడు. అయితే 2007 వరల్డ్‌కప్‌లో కైఫ్‌కు స్థానం లభించలేదు. ఆ సమయంలో టీమ్ఇండియా కోచ్‌గా గ్రెగ్ చాపెల్ ఉన్నాడు. కైఫ్.. తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడే సమయానికి అతని వయసు కేవలం 26ఏళ్లే. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు కైఫ్.
బంతి కన్నుకు తాకి..
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్.. తీవ్రమైన గాయం కారణంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇమ్రాన్ తాహిర్ వేసిన గుగ్లీ బంతి.. ప్రమాదవశాత్తు బౌచర్ కన్నుకు తాకింది. ఈ క్రమంలో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తాను అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు బౌచర్.
ఇదీ చూడండి: వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. త్వరలో ప్రకటన!