ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి, చెన్నై జట్లు అత్యంత విజయవంతమైనవిగా పేరొందాయి. రోహిత్‌సేన ఇప్పటివరకు ఐదు సార్లు ఫైనల్లో తలపడగా నాలుగు సార్లు విజేతగా నిలిచింది. అన్నీ ధోనీసేన పైనే గెలుపొందడం విశేషం. అలాగే చెన్నై ఎనిమిది సార్లు ఫైనల్ చేరినా మూడు సార్లే విజయం సాధించింది. అయితే, ఈసారి ఆ జట్టు లీగ్ దశ నుంచే ఇంటి ముఖం పట్టగా ముంబయి ఆరోసారి ఫైనల్‌కు చేరింది. దీంతో చెన్నై తర్వాత ఆరు సార్లు ఫైనల్‌కు వెళ్లిన జట్టుగా ముంబయి నిలిచింది.
చెన్నై, ముంబయి జట్లు 2010లో తొలిసారి ఫైనల్లో తలపడ్డాయి. అప్పుడు ధోనీసేన 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదొక్కసారే ముంబయిపై ధోనీసేన గెలుపొందింది. ఆ తర్వాత 2013, 2015, 2017, 2019 ఇలా నాలుగుసార్లు ధోనీసేనపై ముంబయే విజయం సాధించింది. అయితే, 2017లో చెన్నై నిషేధంలో ఉండడం వల్ల పుణె జట్టుపై రోహిత్‌సేన విజయం సాధించింది. కాగా, అప్పుడు పుణె కెప్టెన్‌గానూ ధోనీనే వ్యవహరించాడు.
ఈ నేపథ్యంలోనే ముంబయి ఇప్పుడు తొలిసారి ఫైనల్లో ప్రత్యర్థి జట్టులో ధోనీ లేకుండా పోటీపడనుంది. అయితే ప్రత్యర్థి ఎవరనే విషయం ఆదివారం రెండో ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత తెలుస్తుంది. ఇదిలా ఉండగా, ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది ఆరో ఫైనల్. 2009లో దక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన అతడు తర్వాత 2010 నుంచి ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2009లో బెంగళూరుపై ఛార్జర్స్ విజయం సాధించింది.