ఐపీఎల్లో మరో ఘట్టం మొదలైంది. దుబాయ్ వేదికగా తొలి క్వాలిఫయర్ గురువారం జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి, రెండో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరులో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తున్నాయి. మరి చూద్దాం ఏమవుతుందో?
కసితో ముంబయి
పాయింట్ల పట్టికలో ముంబయి అగ్రస్థానంలో ఉన్నప్పటికీ లీగ్ రెండో అర్ధభాగంలో ఈ జట్టు కాస్త డీలా పడింది. గత మ్యాచ్‌లోనూ బాగానే ఆడినా సరే హైదరాబాద్ జట్టు ముందు వీరి సత్తా సరిపోలేదు. గాయంతో కోలుకుని రోహిత్ ఈ పోరులో బరిలో దిగినప్పటికి విఫలమయ్యాడు.
పొలార్డ్(259), డికాక్(443), సూర్యకుమార్ యాదవ్(410), ఇషాన్ కిషన్(428) లాంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉంది. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య(241), కృనాల్ పాండ్య(95) బాగానే రాణిస్తున్నారు. బౌలర్లలో బుమ్రా(23), బౌల్ట్(20), రాహుల్ చాహర్(15), కృనాల్(5) జట్టుకు చక్కటి సహకరమందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ గత మ్యాచులో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలనే కసితో ఉంది ముంబయి.
సమష్టిగా రాణిస్తేనే
దిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ మ్యాచ్‌లో గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆర్సీబీతో గత మ్యాచ్‌తో అజింక్య రహానె(111) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. శిఖర్ ధావన్(525) జోరు మీద ఉన్నాడు. సారథి శ్రేయస్ అయ్యర్(421), పృథ్వీషా(228), పంత్(282) తమ ప్రదర్శనను కొంచెం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ ఆటగాళ్లయినా హెట్మయర్(138), స్టోయినిస్(249) బాగానే సహకరిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో అన్రిచ్, రబాడ, అశ్విన్, అక్షర్ పటేల్ బాగానే ఆడుతున్న సత్తా చాలడం లేదు. మొత్తంగా జట్టు సమష్టిగా రాణించాల్సిన అవసరముంది.
జట్లు (అంచనా)
ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్య, పొలార్డ్, కౌల్టర్-నైల్, రాహుల్ చాహర్, ప్యాటిన్సన్, ధావల్ కులకర్ణి
దిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పంత్, స్టోయినిస్, డేనియల్ సామ్స్, అక్షర్ పటేల్, అశ్విన్, రబాడ, అన్రిచ్
ఇదీ చూడండి 'అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. కప్ మాదే'