Ind Vs WI 3rd ODI : విండీస్ పర్యటనలో భాగంగా జరుగుతున్న చివరి వన్డేకు సర్వం సిద్ధమైంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో మంగళవారం జరగనున్న మూడో వన్డేలో తలపడేందుకు రోహిత్ సేన రెడీగా ఉంది. ఇప్పటికే సిరీస్ 1-1తో సమంగా ఉండటం వల్ల ఈ ఆఖరి మ్యాచ్‌పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. హోరా హోరీగా జరగనున్న ఈ మ్యాచ్ ఎవరి కైవసం అవుతుందన్న ఆసక్తి క్రికెట్ లవర్స్‌లో మొదలైంది. దీంతో ఇరు జట్టు ఏ మాత్రం తగ్గేదేలే అంటూ మైదానంలో దిగనున్నాయి. మరోవైపు గత రెండు వన్డేల్లో భారత్ జట్టు తమదైన స్టైల్లో రాణించినప్పటికీ.. మిశ్రమ ఫలితాలను అందుకోగలిగింది.
తొలి వన్డేలో కష్టపడిన రోహిత్ సేన.. ఓ గెలుపును తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన రెండో వన్డేలో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుంది. బ్యాటింగ్‌లో ప్రయోగాలతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీమ్‌లో లేకపోవడం వల్ల జట్టుకు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ క్రమంలో మంగళవారం జరగనున్న మూడో వన్డేలో ఎటువంటి ప్రయోగాలు చేయకూడదని నిర్ణయించుకున్న మేనేజ్మెంట్.. ఈ మ్యాచ్‌కు పూర్తి స్దాయి జట్టునే ఆడించాలని అనుకుంటోంది. దీంతో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తుది పోరులో ప్రత్యక్షమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండో వన్డేను చేజిక్కించుకున్న కరేబియన్ జట్టు.. అదే జోరుతో ఆఖరి పోరులోనూ విజయపథంలో నడవాలని ఆశిస్తోంది.
IND Vs WI Pitch Report : ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే.. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం పిచ్.. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఈ క్రమంలో బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ మైదానంలో పురుషల క్రికెట్ జట్టుతో జరిగే తొలి అంతర్జాతీయ వన్డే ఇదే. కానీ మూడు మహిళల వన్డే మ్యాచ్‌లు ఇక్కడ జరిగాయి. కానీ ఒక్క మ్యాచ్‌లోనూ 200 పరుగులు నమోదు కాలేదు.
IND Vs WI Weather Forecast : ఇక సాయంత్రం జరగనున్న మూడో వన్డే సమయానికి వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ చిన్నపాటి వాన పడే అవకాశాలు ఉన్నట్లు ఆక్యూవెధర్ సంస్థ తమ రిపోర్ట్‌లో వెల్లడించింది. వర్షం పడటానికి యాబై శాతం ఆస్కారం ఉందని ఆ నివేదికలో పేర్కొంది. దీంతో ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే.. అప్పుడు రెండు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటాయి.