టెస్టు క్రికెట్‌కు కాలం చెల్లిందనే వ్యాఖ్యలపై తాను ఏకీభవించనని టీమిండియా మాజీ సారథి, ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. అభిమానులింకా ఈ ఫార్మాట్‌ను ఆదరిస్తున్నారని, కాకపోతే స్టేడియాల్లో కాకుండా డిజిటల్ మాధ్యమాల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నారని చెప్పాడు. ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనపైనా స్పందించాడు. ఐదు రోజులు ఆడితేనే అది టెస్టు అవుతుందని, నాలుగు రోజులనేది ఆట కాదని అన్నాడు కుంబ్లే.
2023-2031 సీజన్‌లో ఐసీసీ.. కచ్చితంగా నాలుగు రోజుల టెస్టులు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో చాలా మంది మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీనిపై కుంబ్లే సారథ్యంలో కమిటీని వేశారు. దుబాయ్ వేదికగా వచ్చే నెలలో ఇందుకు సంబంధించిన సమావేశాలు జరగనున్నాయి. ఇందులో 4 రోజుల టెస్టు ప్రతిపాదనపై కుంబ్లేతోపాటు ఆండ్రూ స్ట్రాస్, రాహుల్ ద్రవిడ్, మహేలా జయవర్ధనే, షాన్ పొలాక్ సహా పలువురు క్రికెటర్లు చర్చించనున్నారు.