ఏ ఆటలోనైనా నిత్యం కొత్త రికార్డులు వస్తుంటాయి. పాత రికార్డులు కనుమరుగవుతుంటాయి. రికార్డులున్నదే తిరగరాయడానికి కదా! కానీ, అన్ని రికార్డులనూ బ్రేక్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని అందనంత ఎత్తులో ఉంటాయి. ఐపీఎల్‌లో కూడా ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. వాటిలో ఉన్న ఈ టాప్ 5 రికార్డులు ఎప్పటికీ బ్రేక్ కాకపోవచ్చు!
ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు..
ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ ఒకడని నిస్సందేహంగా చెప్పొచ్చు. అందుకు అతడు నెలకొల్పిన రికార్డులే నిదర్శనం. ఇక.. టీ20 ఫార్మాట్‌లో ఒక్కసారి శతకం సాధించడమే కష్టమైన పని. అలాంటిది 2016 ఐపీఎల్‌లో భీకర ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా 'రన్ మెషిన్' ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. ఆ సీజన్‌లో మొత్తం 16 మ్యాచులాడిన విరాట్ 81.08 సగటు, 152.03 స్ట్రెక్‌రేట్‌తో.. 973 పరుగులు సాధించాడు. ఇందులో 4 శతకాలు, 7 అర్ధశతకాలున్నాయి. ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు బాదడం, అన్ని పరుగులు చేయడం మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు!
175 పరుగుల వ్యక్తిగత స్కోరు..
టీ20 క్రికెట్ చరిత్రలో ఉన్న గొప్ప ఆటగాళ్ల జాబితాలో క్రిస్‌గేల్ మొదటి వరుసలో ఉంటాడు. అంతర్జాతీయ, ఇతర విదేశీ టీ20 లీగ్‌ల్లో అతడు ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడి అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇక.. ఐపీఎల్‌లో మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. అదే 2013లో పుణె వారియర్స్‌పై 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం. ఇది ఐపీఎల్‌లోనే కాకుండా టీ20 క్రికెట్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు. కేవలం 66 బంతుల్లోనే 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాది ఈ ఘనతను అందుకున్నాడు. 'యూనివర్స్ బాస్' గేల్ నెలకొల్పిన 175 పరుగుల రికార్డును బ్రేక్ చేయడం బహుశా ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు.
ఓవర్‌లో 37 పరుగులు..
సాధారణంగా ఒక ఓవర్‌లో అత్యధికంగా 36 పరుగులు చేయొచ్చు. యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, గిబ్స్‌తోపాటు మరికొంతమంది ఒకే ఓవర్‌లో 36 పరుగులు చేశారు. కానీ 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోచి టస్కర్స్ కేరళ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 37 పరుగులొచ్చాయి. మొదట బ్యాటింగ్ చేసిన కోచి జట్టు కేవలం 125 పరుగులే చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు అలవోకగా ఛేదించింది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన మూడో ఓవర్‌లో గేల్ వరుసగా 6,6,4,4,6,6,4 బాదాడు. కాగా.. ఇందులో రెండో బంతి నోబాల్. దీంతో ఒకే ఓవర్లో 37 పరుగులొచ్చాయి. ఈ మ్యాచ్‌లో క్రిస్‌గేల్ కేవలం 16 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు.
229 పరుగుల భాగస్వామ్యం..
సాధారణంగా టీ20ల్లో కొన్ని జట్లు 200 పరుగుల మార్కును దాటడానికే చెమటోడ్చుతాయి. అలాంటిది ఇద్దరు బ్యాట్స్‌మెన్ 200కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం అసాధారణ విషయం. ఇక.. 2016లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ లయన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. దీంట్లో కోహ్లీ సేన మొదట బ్యాటింగ్‌కు దిగి 19/1 కష్టాల్లో ఉంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి, డివిలియర్స్ జోడీ.. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ గుజరాత్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించి పరుగుల వరద పారించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే 229 పరుగుల అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది ఈ ద్వయం. ఈ మ్యాచులో విరాట్ కేవలం 55 బంతుల్లో 109 పరుగులు చేశాడు. డివిలియర్స్ (129; 52 బంతుల్లో 10×4, 12×6) కూడా శతకం చేయడం గమనార్హం. ఐపీఎల్‌లో రెండో అత్యధిక పరుగుల భాగస్వామ్యం (215)ను కూడా ఈ జోడీయే నెలకొల్పడం విశేషం.
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 6/12..
2019లో ముంబయి తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన విండీస్ ఫాస్ట్‌బౌలర్ అల్జారీ జోసెఫ్ తన మొదటి మ్యాచ్‌లోనే రికార్డు సృష్టించాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అతడు.. నాలుగు ఓవర్లు వేసి కేవలం 12 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నెలకొల్పాడు. అరంగేట్ర ఆటగాడిగానూ ఇదే ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన. ఈ రికార్డు బ్రేక్ కావాలంటే ఎవరైనా బౌలర్ ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టాలి లేదా 12 కంటే తక్కువ పరుగులకే 6 వికెట్లు తీయాలి. బహుశా ఈ రికార్డు బ్రేక్ కాకపోవచ్చు. అంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్ ఫాస్ట్‌బౌలర్ సొహైల్ తన్వీర్ (6/14) పేరిట ఉండేది.
ఇదీ చదవండి: ఐపీఎల్ నాయకా.. ఎలా నడిపిస్తావో నీవిక!