భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. పరిస్థితులకు తగ్గట్లు పోస్ట్‌లు పెడుతూ, కామెంట్లు చేస్తూ నెటిజన్లను అలరిస్తుంటాడు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా విషయంలోనూ అలాంటిదే రాసుకొచ్చాడు. ఈ వైరస్‌కు ఇగో ఎక్కువని, తనంతట తాను మన ఇంటిలోని ప్రవేశించదని చమత్కరించాడు. అయితే ప్రజలు అత్యవసర సమయాల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరాడు. తద్వారా వైరస్‌ను ఆహ్వానించే అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నాడు.
ప్రజలందరూ లాక్డౌన్ పరిస్థితులు ఉన్నన్ని రోజులు ఇంట్లో ఉంటే వైరస్‌ను తరిమికొట్టొచ్చని సెహ్వాగ్ అన్నాడు. బయటకు రావాలనే ఆలోచన మానుకోవాలని సూచించాడు.
ప్రస్తుతం ఈ వైరస్ ప్రభావం వల్ల ఐపీఎల్ వాయిదా పడింది. ఈనెల 29న ప్రారంభం కావాల్సిన టోర్నీ.. ఏప్రిల్ 15కు వెళ్లింది. అయితే అప్పుడూ మొదలవుతుందా? లేదా? అనేది సందేహంగానే ఉంది. ఈ విషయమై త్వరలో స్పష్టత రానుంది.