ఇటీవల కాలంలో పాక్ క్రికెటర్లు కొందరు.. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన వారు.. గతంలో తమ మధ్య జరిగిన సంఘటనల్ని బయటపెడుతున్నారు. ఈ విషయాలపై స్పందించిన ఆ దేశ బౌలర్ సొహైల్ తన్వీర్.. సామాజిక మాధ్యమాల్ని బాధ్యాతయుతంగా వినియోగించాలని వారికి సూచించాడు.
"మా దేశానికి చెందిన మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియాను మరింత బాధ్యతగా ఉపయోగించాలి. కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. పాకిస్థాన్ క్రికెట్‌ను చులకన చేసేలా ఉన్నాయి. నేరుగా చెప్పలేని మాటలు, అభిప్రాయాలను సోషల్ మీడియాలో బయటపెట్టొద్దు. మీరు వారిని మరోసారి కలవాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుంది" -సొహైల్ తన్వీర్, పాక్ సీనియర్ బౌలర్
ఈ మధ్యే.. పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్.. హెడ్‌కోచ్, చీఫ్ సెలక్టర్‌గా మిస్బాఉల్ హక్‌ను నియమించడంపై బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా, ఫైజుల్ ఇక్బాల్.. యూసుఫ్‌పై సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడికి దిగారు.
పాక్ తరఫున రెండు టెస్టులు ఆడిన తన్వీర్.. 62 వన్డేలు, 57 అంతర్జాతీయ టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. చివరగా 2017లో పాక్ తరఫున బరిలోకి దిగాడు.