ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్‌ను ఎంపిక చేసింది ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ). ఈ పదవి కోసం పోటీపడిన టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌కు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బెయిలీస్ స్థానంలో వుడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
అయ్యో... చేజారిపోయిందే...!
ప్రధాన కోచ్ స్థానానికి పోటీపడిన గ్యారీ కిర్‌స్టన్‌కు షాకిచ్చింది ఈసీబీ. ఇటీవల భారత జట్టు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకొని భంగపడ్డ ఆయనను.. ఇంగ్లండ్ బోర్డూ పక్కనపెట్టేసింది. గతంలో భారత మహిళల జట్టుకు కోచ్‌గా అవకాశం వచ్చినా.. కిర్‌స్టన్ ఉపయోగించుకోలేదు.
ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్ అందించిన మాజీకోచ్ ట్రెవర్ బేలిస్ ఒప్పందం గత నెల ముగిసింది. ఈ బాధ్యతలు చేపట్టేందుకు కోచ్‌ల కోసం ఈసీబీ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకోసం సిల్వర్‌వుడ్, కిర్‌స్టన్, అలెక్ స్టీవార్ట్, గ్రాహమ్ ఫోర్డ్‌లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పలువురు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు కిర్‌స్టన్ నియమానికే ఓటేశారు. అతడే బాధ్యతలు చేపడతారని అంతా భావించారు.
ముఖాముఖి నిర్వహించిన అనంతరం ఈసీబీ సెలక్షన్ ప్యానల్... సిల్వర్‌వుడ్ పేరును ఖరారు చేసింది. ఇంటర్యూలో కిర్‌స్టన్ కంటే సిల్వర్‌వుడ్ చెప్పిన సమాధానాలకే బోర్డు సంతృప్తి చెందినట్లు సమాచారం. స్వదేశీ క్రికెటర్ కావడం సహా ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించడం సిల్వర్‌వుడ్‌కు కలిసొచ్చింది. అంతేకాకుండా టెస్టు కెప్టెన్ జో రూట్, పరిమిత ఓవర్ల క్రికెట్ సారథి ఇయాన్ మోర్గాన్‌తో సత్సంబంధాలున్నాయి.
న్యూజిలాండ్ పర్యటనతో ఆయన ఒప్పందం ఆరంభం అవుతుంది. నవంబర్‌లో ఇంగ్లాండ్ జట్టు ఐదు టీ20లు, రెండు టెస్టుల్లో కివీస్‌తో తలపడనుంది. సిల్వర్‌వుడ్ 1996-2002 మధ్య ఇంగ్లాండ్ తరఫున ఆరు టెస్టులు, ఏడు వన్డేలు ఆడాడు. ఇంగ్లాండ్ సహాయ సిబ్బందిలో చేరేముందు 2017లో ఎసెక్స్ జట్టు కౌంటీ ఛాంపియన్‌షిప్ గెలిచేలా కోచింగ్ ఇచ్చాడు.