పొట్టిగా ఉన్నామని, సన్నగా కనిపిస్తున్నామని కొంతమంది ఎప్పుడూ నిరాశతో ఉంటారు. అలాంటి వారికి ఈ వ్యక్తి ఓ ఉదాహరణ. ఎందుకంటే అతడు పొడుగ్గా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అఫ్గాన్‌కు చెందిన షేర్‌ఖాన్ 8 అడుగుల 2 అంగుళాల ఎత్తుంటాడు. క్రికెట్ అంటే చెవికోసుకునే ఈ అఫ్గానిస్థాన్ క్రికెట్ అభిమానికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది.
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా లఖ్‌నవూలో అఫ్గానిస్థాన్-వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం(నవంబర్ 6న) తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అతడికి అక్కడ బస చేయడానికి హోటల్ గదులు దొరకలేదట. చూడటానికి భారీ ఆకారంలో ఉండటం వల్ల ఎవరూ సహాయం చేయలేదు. ఫలితంగా కాబుల్ నుంచి వచ్చిన షేర్‌ఖాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు.
షేర్‌ఖాన్ ధ్రువపత్రాలను పరిశీలించిన పోలీసులు... అతడు బస చేయడానికి ఓ ప్రదేశాన్ని చూపించారట. ప్రస్తుతం అతడి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ వన్డే సిరీస్‌లో అఫ్గానిస్థాన్‌కు రషీద్ ఖాన్ నాయకత్వం వహించాడు. వెస్టిండీస్ జట్టుకు కీరన్ పోలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్ తర్వాత ఇరుజట్ల మధ్య మూడు టీ20ల సిరీస్, ఏకైక టెస్టు జరగనుంది. అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లన్నీ ఇదే స్టేడియంలో జరగనున్నాయి.