నేడు ప్రారంభమైన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్, వీనస్, ఓసాకా శుభారంభం చేశారు. తొలి రౌండ్లో నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
56నిమిషాల పాటు సాగిన పోరులో జర్మనీకి చెందిన లారా సిగ్మండ్పై 6-1,6-1 తేడాతో సెరెనా విజయం సాధించింది. ఇది ఆమెకు 20వ ఆస్ట్రేలియన్ ఓపెన్ కాగా.. ఈ టోర్నీలో 100వ మ్యాచు. బుధవారం జరగబోయే రెండో రౌండ్లో సెర్బియాకు చెందిన నైనా టోజనోవిక్తో తలపడనుంది.
వీనస్ కూడా తొలి రౌండ్లో అదరగొట్టింది. కిర్‌స్టన్ ఫ్లిప్కెన్స్పై 7-5,6-2 తేడాతో విజయాన్ని అందుకుంది. మరోవైపు రష్యాకు చెందిన అనస్టాసియాను 6-1,6-2 తేడాతో ఓసాకా ఓడించింది. ఈ పోరు 68 నిమిషాలు జరిగింది. ఫలితంగా బుధవారం జరిగే రెండో రౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన గార్సియాతో ఓసాకా పోటీ పడనుంది.
జకోవిచ్..
స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఫ్రాన్స్‌కు చెందిన జెర్మీ చార్డీను 6-3,6-1,6-2 తేడాతో ఓడించాడు. ఈ పోరు 91 నిమిషాల పాటు జరిగింది. కాగా, యువ టెన్నిస్ ప్లేయర్ డొమినిక్ థీమ్ కజికిస్థాన్కు చెందిన మిఖాయిల్ కుకుష్కిన్ను వరుస సెట్లలో 7-6(2),6-2,6-3 తేడాతో చిత్తుచేశాడు. రెండో రౌండ్లో జర్మనీకి చెందిన డొమినిక్ కియోఫర్ లేదా బొలివియన్ ఆటగాడు హూగో డెలియన్తో తలపడనున్నాడు.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియన్ ఓపెన్.. ఫేవరెట్ జకోవిచ్