సౌతాఫ్రికా, జింబాబ్వే పర్యటనలకు జట్టు ఎంపికపై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తన సూచనలను పక్కనపెట్టడంపై అతడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ), చీఫ్ సెలక్టర్ మహ్మద్ వసీమ్‌ను కలిశాడని సమాచారం. ఈ వ్యవహారంపై స్పందించాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. తన నిర్ణయానికి బాబర్ గట్టిగా కట్టుబడి ఉండాలని, అతడి డిమాండ్లు నెరవేరకపోతే సారథిగా రాజీనామా చేయాలని బాబర్‌కు సూచించాడు.
"పీసీబీతో జట్టు ఎంపికలో తన సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని బాబర్ అజామ్ చెప్పినట్లు తెలుస్తోంది. బాబర్ నిజంగా అంత బాధపడి ఉండే, ఒక బ్రాండ్‌గా ఎదగాలంటే అతడు తక్షణమే కెప్టెన్‌గా వైదొలగాలి. తద్వారా మరోసారి ఇలాంటివి జరగరాదనే గట్టి సందేశం పంపాలి. లేదంటే అతడు మరో సర్ఫరాజ్లా తయారవుతాడు."
- షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ బౌలర్
కెప్టెనే కీలకం..
కెప్టెన్ సూచనలను విస్మరించడంపై చీఫ్ సెలక్టర్ మహ్మద్ వసీమ్‌ను తప్పుబట్టాడు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్. "జట్టు.. సంప్రదింపులతో ఎంపికవుతుంది. అందులో కెప్టెన్ కీలకం. చీఫ్ సెలక్టర్, కోచ్ అంత ముఖ్యమైనవారు కాదు. ఎందుకంటే వారు మైదానం లోపలికి వెళ్లరు. ఆట కోసం పోరాడేలా చేయడంలో జట్టుపై కెప్టెన్‌కు విశ్వాసముండాలి. జట్టు ఎంపిక కెప్టెన్‌కు అనవసరమని వసీమ్ ఎలా అంటాడు? సెలక్షన్లో సారథికి పూర్తి అధికారం ఉంటుందని అతడు చెప్పిన మాటలు ఏమయ్యాయి?" అని ఇంజమామ్ ప్రశ్నించాడు.
ఇదీ చూడండి: సూర్య, శ్రేయస్ మెరుపులు.. ఇంగ్లాండ్ లక్ష్యం 186