'మిస్టర్ డిపెండబుల్'కు సరైన అర్థం చెప్పిన క్రికెటర్ అతడు. వరుసగా పడుతున్న వికెట్లను అడ్డుకోవడం ఘోర ఓటములను తప్పించడం అతడికే చెల్లింది. నాయకత్వంలో గంగూలీకి సహాయకుడిగా.. ఆపై జట్టుకు సారథిగా.. ఐపీఎల్, అండర్-19, భారత్-ఏ జట్లకు కోచ్‌గా.. ప్రస్తుతం ఎన్‌సీఏ అధినేతగా విభిన్న పాత్రల్లో ఒదిగిపోయాడు. ప్రస్తుతం ఎంతోమంది మాజీలు టీ20 లీగులో కొన్నాళ్లకే కోట్లు గడిస్తున్నా దేశ క్రికెట్‌కే అంకితమైన ఆ నిస్వార్థ సేవకుడే రాహుల్ ద్రవిడ్.
డబ్బు చేసుకోవడం లేదు!
సచిన్, గంగూలీ, ద్రవిడ్, కుంబ్లే, లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్.. ఈ ఆరుగురూ టీమ్‌ఇండియాకు ఒకప్పుడు మూలస్తంభాలు. వివిధ ఫార్మాట్లలో దేశం తరఫున అదరగొట్టారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ఐపీఎల్‌లో కొన్నాళ్లు అలరించారు. పూర్తిగా ఆటకు వీడ్కోలు పలికాక ముంబయికి సచిన్, హైదరాబాద్‌కు లక్ష్మణ్ మెంటార్లుగా స్థిరపడ్డారు. బెంగాల్ క్రికెట్ సంఘం నుంచి గంగూలీ ఏకంగా బీసీసీఐకే 'దాదా'(అధ్యక్షుడు) అయ్యాడు. కుంబ్లే ఓ వైపు ఐసీసీలో పనిచేస్తూ ఐపీఎల్‌లో మళ్లీ కోచ్‌గా మారాడు. ఈ ఏడాది పంజాబ్‌ను నడిపించాడు. వీరేంద్ర సెహ్వాగ్ రెండేళ్ల క్రితం వరకు టీ20 లీగులో కోచ్/క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పుడు తనదైన శైలిలో ఆటకు వ్యాఖ్యానం చెబుతూ అదరగొడుతున్నాడు. ఇక టీమ్‌ఇండియా కోచ్ రవిశాస్త్రి కోట్ల రూపాయల వేతనం తీసుకుంటున్నాడు. కానీ అన్ని అర్హతలూ ఉన్నా ద్రవిడ్ ఒక్కడే డబ్బు చేసుకోలేక పోతున్నాడు!
మానసిక దృఢత్వంపై పాఠాలు
అండర్-19, భారత్-ఏ జట్ల కోచ్‌గా ద్రవిడ్ చెరిపేయలేని ముద్ర వేశాడు. అండర్-19 జట్టును ఒకసారి రన్నరప్ మరోసారి విజేతగా నిలిపాడు. భవిష్యత్ భారత్ కోసం యువ క్రికెటర్లను మెరికెలుగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు కోచ్ కానప్పటికీ పరోక్షంగా మార్గనిర్దేశం చేస్తున్నాడు. యువ క్రికెటర్ల ఆటతీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నాడు. చివరి అండర్-19 ప్రపంచకప్‌లో ప్రియమ్‌గార్గ్ జట్టుకూ సలహాలు ఇచ్చాడు. అంతేకాకుండా మైదానంలోకి అడుగుపెట్టే ముందు.. పెట్టాక ఎలాంటి వైఖరితో ఉండాలో.. మానసిక స్థితి ఎలాగుండాలో వీడియో సందేశం ద్వారా వివరించాడు. ఆట, టెక్నిక్‌కు సంబంధించిన మెళకువలను ద్రవిడ్ ఎక్కువగా నేర్పించడు. వారికి సహజసిద్ధంగా అబ్బిన టెక్నిక్‌నే అనుసరించాలని చెబుతాడు. దానిని మారిస్తే మళ్లీ కుదురుకోవడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా ఆటగాడు క్రీజులో ఇబ్బంది పడతాడు. అందుకే మానసిక దృఢత్వంపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తాడు. ఆలోచించే దృష్టికోణాన్ని సరిచేసేందుకు శ్రమిస్తాడు. లోపల ఏం భావిస్తామో బయట అదే జరుగుతుంది అని నమ్మే వ్యక్తి ఆయన.
స్టార్ కల్చర్ నచ్చకే!
నిజానికి ద్రవిడ్ కోరుకోవాలే గానీ టీమ్‌ఇండియా కోచ్ పదవి సులభంగా అతడి సొంతమవుతుంది. కానీ అతడా పనిచేయలేదు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. భారత జట్టులో స్టార్ కల్చర్ ఎక్కువ. చాలా కఠినంగా ఉండే మిస్టర్ డిపెండబుల్‌కు ఇది అంతగా నచ్చదు! అతడెంతో స్థితప్రజ్ఞతతో ఉంటాడు. క్రమశిక్షణలో ఏమాత్రం అశ్రద్ధ చూపినా సహించడు. స్టార్ మనస్తత్వంతో ఏ ఆటగాడైనా తన సూచనలను పెడచెవిన పెడితే అతడు ఊరుకోడు. ఇప్పటికే ఎన్నాళ్లుగానో ఉన్న క్రికెటర్లతో విసుగ్గా ఉండటం ఎందుకన్నది మరో ఆలోచన. కుంబ్లే×కోహ్లీ తరహా అభిప్రాయభేదాలు వస్తాయని అతడు ముందే ఊహించాడు! అందుకే తెలివిగా అండర్-19, భారత్-ఏ కోచ్‌గా పనిచేశాడు. 19 ఏళ్ల లోపు కుర్రాళ్లకు ద్రవిడ్‌తో సాంగత్యం దొరకడమే అదృష్టం. ఆయన్ను వారు దైవంలా భావిస్తారు. ఇక భారత్-ఏ కుర్రాళ్లు.. జాతీయ జట్టులో స్థిరపడాలన్న ఆకాంక్షతో ఉంటారు. స్టార్ కల్చర్ అంతగా అబ్బిఉండదు. కెరీర్‌లో ఎదిగేందుకు అతడి మాటల్ని వేదవాక్కులా భావిస్తారు. 5-10 ఏళ్ల తర్వాత వీరే టీమ్‌ఇండియాలో ఉంటారు. అప్పుడు కోచ్‌గా వచ్చినా ఇబ్బందేమీ ఉండదు.
మయాంక్ సహా మరెందరో
గత నాలుగేళ్లలో టీమ్‌ఇండియాకు ఆడుతున్న క్రికెటర్లలో చాలామంది ఫామ్ కోల్పోయి మళ్లీ భారత్-ఏ తరఫున ఆడారు. అలాంటి వారికి ద్రవిడ్ మానసిక పాఠాలు చెప్పారు. మనీశ్ పాండే ఎన్నోసార్లు జాతీయ జట్టు, భారత్-ఏకు సమాంతరంగా ఆడాడు. ఇక మయాంక్ అగర్వాల్‌కు ద్రవిడ్ చేసిన ఉపకారం అంతాఇంతా కాదు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నా అతడికి టీమ్‌ఇండియా అవకాశం రాలేదు. అలాంటప్పుడు ద్రవిడ్ వెన్నుతట్టాడు. ఓపిగ్గా.. మరింత కసిగా పరుగులు చేయాలన్న సలహా ఇచ్చాడు. కేఎల్ రాహుల్ గతేడాది ముందు ఎంతో ఇబ్బందిపడ్డాడు. ఎంతో ప్రతిభ ఉన్న అతడిని కోహ్లీ రిజర్వు బెంచీపైనే కూర్చోబెట్టాడు. వన్డే, టీ20ల్లో వరుసగా అవకాశాలు ఇవ్వలేదు. మళ్లీ భారత్-ఏకు ఆడి.. ద్రవిడ్ మార్గనిర్దేశం పొంది టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, పృథ్వీషా, కృనాల్ పాండ్య, నవదీప్ సైని.. ఇలా ఎందరినో అతడు మానసికంగా బలంగా మార్చాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌లోనూ అతడి శిష్యులు చక్కగా రాణించారు.
ఆ నిబంధన సవరిస్తే..
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) బాధ్యుడిగా ద్రవిడ్ కొనసాగుతున్నాడు. బెంగళూరులో అధునాతన సౌకర్యాలతో ప్రపంచస్థాయిలో సరికొత్త ఎన్‌సీఏ భవన నిర్మాణం అతడి పర్యవేక్షణలో సాగనుంది. ఇందుకోసం దాదాతో కలిసి అతడు ప్రణాళిక రూపొందించాడు. భవిష్యత్తు భారత క్రికెటర్లకు ఇదో స్వర్గధామంగా మారాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాడు. అదే సమయంలో గాయపడ్డ ఆటగాళ్లను పర్యవేక్షిస్తున్నాడు. ముఖ్యంగా బౌలర్లను ప్రత్యేకంగా చూసుకుంటున్నాడు. నిజానికి రెండు నెలలు జరిగే ఐపీఎల్‌లో అతడు పనిచేస్తే కాదనేవారెవ్వరూ లేరు. ఎందుకంటే మిగతా అందరూ అలాగే చేస్తున్నారు. అయితే బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం ఒకరికి ఒక పదవి, పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉండొద్దన్న నిబంధనలు ఇందుకు అడ్డం పడుతున్నాయి. అతడే కాదు మరెంతో మందికి ఇది ఇబ్బందిగా మారింది. అందుకే భారత క్రికెట్‌కు మాజీల సేవలు అందకుండా ఈ నిబంధన అడ్డుపడుతోందని గంగూలీ బాహాటంగా చెబుతున్నాడు. దానిని సవరించేందుకు సుప్రీంలో పోరాడుతున్నాడు. ఒకవేళ ఈ నిబంధనలో మార్పు వస్తే అటు భారత క్రికెట్.. ఇటు ఫ్రాంచైజీ క్రికెట్‌కు సేవ చేసే అవకాశం నిస్వార్థ సేవకుడైన ద్రవిడ్‌కు లభిస్తుంది.
ఇదీ చూడండి :